ఒకే ఒక్క జన నాయకుడు , ఏపీ సీఎం జగన్ సర్కార్‌ను అప్రతిష్టపాలు చేయడానికి ఎల్లో మీడియా, ప్రతిపక్ష నాయకులు ఎంతకైనా బరి తెగించడానికి సిద్ధమయ్యారు. ఏపీలో ప్రతిపక్ష నేతలు, ఎల్లో మీడియా శాడిజానికి అవధుల్లేవు. నిజాన్ని నిర్భయంగా ఉరి తీయడానికి, మహా విధ్వంసానికి కారణమవుతున్న మహమ్మారి కరోనాని బతికించడానికి వీళ్లు వెనకాడలేదు. ఇలాంటి వాళ్లని ఏమని పిలవాలో కూడా నాగరిక సమాజానికి పదాలు దొరకడం లేదు.
ఏపీ ప్రతిపక్ష నేతలు, ఎల్లో మీడియా దాష్టీకాల వల్ల అంతిమంగా ప్రజలే నష్టపోతారనే నగ్న సత్యాన్ని గ్రహించడం లేదు. కళ్లున్నా…కబోదల్లా వీళ్లు వ్యవహరిస్తున్నారు. కరోనా కేసుల విషయమై నిజాన్ని దాచి, అబద్ధాలను వండివారుస్తూ జగన్ సర్కార్‌ను దోషిగా నిలబెట్టాలనే ప్రతిపక్ష నేతల, ఎల్లో మీడియా ప్రతినిధుల చేష్టలు…వాళ్ల స్థాయినే దిగజార్చుతున్నాయని గ్రహించడం లేదు.
ఏపీ , తెలంగాణలో కరోనా కేసులను పరిశీలిస్తే అసలు వాస్తవాలేంటో తేలుతాయి. ముందుగా తెలంగాణను తీసుకుందాం. మార్చి 2వ తేదీ నుంచి ఇప్పటి వరకు 18,756 పరీక్షలు నిర్వహించారు. 1,001 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే 25 మంది ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలో పరీక్షించిన నమూనాల ప్రకారం కరోనా వైరస్ 5.4 శాతం వ్యాప్తి చెందుతున్నట్టు తేలింది.
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం. ఇప్పటి వరకు 68,034 మందికి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 1,097 మందికి పాజిటివ్ అని తేలింది. మిగిలిన 66,937 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఏపీలో 31 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. రోజులు 8 వేలు చొప్పున కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సంఖ్యను పది వేలకు పెంచేందుకు జగన్ సర్కార్ అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. కాగా ప్రతి మిలియన్ జనాభాకు అత్యధికంగా 1,274 చొప్పున అత్యధిక పరీక్షలు నిర్వహిస్తున్న రాష్ట్రంగా ఏపీ ముందు వరుసలో ఉంది.
దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో కరోనా వ్యాప్తి చాలా తక్కువ. అది కూడా రెడ్‌జోన్ల పరిధిలోనే కేసులు ఎక్కువ నమోదు అవుతున్నాయి. కరోనా కట్టడికి మరిన్ని కట్టుదిట్టమైన చర్యలను జగన్ సర్కార్ ఎప్పటికప్పుడు చేపడుతోంది. దేశంలో కరోనా వ్యాప్తి, ఇన్‌ఫెక్షన్ రేటు చాల రాష్ట్రాలతో పోల్చితే ఏపీలో చాలా తక్కువ. ఢిల్లీ , మహారాష్ట్ర, మద్యప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో 6.4 శాతం నుంచి 8.6 శాతం వరకు ఇన్‌ఫెక్షన్ రేటు ఉన్నట్టు పరీక్షలు వెల్లడించాయి. ఏపీలో ఇన్‌ఫెక్షన్ రేటు 1.6 శాతం మాత్రమే ఉంది. ఇదే జాతీయ సగటు రేటు 4.23 శాతం ఉంది.
ప్రపంచ మానవాళి సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ముందు మన ఊరు, మన రాష్ట్రం, ఆ తర్వాత పొరుగు రాష్ట్రం, దేశం బాగుండాలని ప్రార్థించని వాళ్లు ఉండరు. మరీ ముఖ్యంగా నిన్నమొన్నటి వరకు అంతా ఒక రాష్ట్రంగా కలిసి ఉన్న తెలంగాణ, సీమాంధ్ర ప్రజలు ఆయురారోగ్యాలతో కలిసి ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.
అదేంటో గానీ, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, ఆయన పెంపుడు మీడియా, ఇతర పార్టీల నాయకులు మాత్రం ఆంధ్రప్రదేశ్ కరోనాతో నాశనం కావాలని కోరుకుంటున్నారు. ఏపీపై కరోనా పంజా విసిరిందనే అశుభవార్తల కోసమే వాళ్లు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. వాస్తవాలను చెప్పకపోయినా, రాయకపోయినా ఫర్వాలేదు.
కానీ, వాటిని దాచి జగన్ సర్కార్‌ను బద్నాం చేయాలనే వాళ్ల ప్రయత్నాలు మాత్రం ఎవరూ, ఎప్పటికీ క్షమించకూడదు. కానీ నిజం నిప్పులాంటిది. దాన్ని అణచివేయాలనుకునే వాళ్లనే భస్మం చేస్తుంది. ప్రతిపక్ష నాయకులు, ఎల్లో మీడియా ఇలాగే నిజాలను ఉరి తీయాలనుకుంటే…ఆ కరోనా మహమ్మారికి తామే బలి కావాల్సి వస్తుందని గ్రహిస్తే మంచిది. కరోనా వైరస్ కంటే ప్రమాదకారిగా పరిణమించిన ఎల్లో వైరస్‌ను కూడా కట్టడి చేసేందుకు ఏపీ ప్రజలు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది.