ఏపీలో లక్ష దాటిన కోరోనా పరీక్షలు: పాజిటివ్ కేసులు 1463

కరోనా టెస్టుల్లో ఆంధ్రప్రదేశ్‌ మరో మైలు రాయిని అందుకుంది. లక్షకు పైగా పరీక్షలు నిర్వహించింది ఆంధ్రప్రదేశ్‌ ఇప్పటిదాకా. రాష్ట్రంలో అనూహ్యంగా కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండగా, దానిక్కారణం అత్యధిక స్థాయిలో పరీక్షలు నిర్వహించడమేనని చెబుతోంది. రానున్న రోజుల్లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుతుందని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది.

కాగా, ఈ రోజు కొత్తగా 60 కరోనా పాజిటివ్‌ కేసులు రాష్ట్రంలో నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో 25 కేసులు, గుంటూరు జిల్లాలో 19 కేసులు నమోదు కాగా, అనంతపురంలో 6, విశాఖపట్నంలో రెండు, పశ్చిమగోదావరి జిల్లాలో రెండు కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గత కొద్ది రోజులుగా కృష్ణా జిల్లాలో కరోనా వైరస్‌ తీవ్ర రూపం దాల్చగా, నిన్న అక్కడ ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం.

అయితే, ఆరెంజ్‌ జోన్‌లో వున్న అనంతపురం జిల్లాలో తాజాగా ఆరు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. మరోపక్క, కరోనా మృతుల సంఖ్య రాష్ట్రంలో 33కి పెరిగింది. నిన్న ఒక్క రోజే 7902 పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా, కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 403కి పెరగడం పెద్ద ఊరటగానే చెప్పుకోవాలి.

ఒక్కరోజులోనే సుమారు 80 మంది కరోనా బాధితులు, కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ముందు ముందు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గి, కోలుకున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని వైద్య ఆరోగ్య శాఖ అంచనా వేస్తోంది. కర్నూలు జిల్లాలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టిన విషయం విదితమే.

గుంటూరు జిల్లాపైనా స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది ప్రభుత్వం. చిత్తూరు జిల్లాలో కొత్తగా కేసులు నమోదు కాకపోవడంతో జిల్లా ప్రజానీకం, అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నారు. కరోనా ప్రభావం ఎక్కువగా వున్న జిల్లాల్లో చిత్తూరు కూడా ఒకటి. మొత్తం 80 కరోనా పాజిటివ్‌ కేసులు ఇప్పటిదాకా ఈ జిల్లాలో నమోదయ్యాయి. విజయనగరం జిల్లా మాత్రమే ఇప్పటిదాకా రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల్లేని జిల్లా.