తిరుపతిపై గతంలో జగన్ మాట్లాడిన మాటల వీడియోను బయటపెట్టినందుకు తనపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. తిరుపతి లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. దీనిపై 505 సెక్షన్ ఎలా అప్లై అవుతుందో కేసు పెట్టినవారు చెప్పాలన్నారు. అమావాస్యకోసారి తనపై కేసులు పెట్టడం వారికి అలవాటైపోయిందని విమర్శించారు. వైఎస్ వివేకా ఇంట్లో కుక్కకు విషం పెట్టి ఎవరు చంపారో వారిపైనే కేసు పెట్టాలని ఆయన అన్నారు.
బాబాయ్ రక్తాన్ని తుడిచిన వారిపైనే కేసు పెట్టాలని అన్నారు. కత్తిపోటుతో చనిపోతే గుండెపోటు అని చెప్పిన విజయసాయిరెడ్డిపై కేసు పెట్టాలన్నారు. నీటి విషయంపై మాట్లాడుతూ.. పక్క రాష్ట్రాలతో కుమ్మక్కై ఏపీ నీటి వాటాలో రాష్ట్రానికి సీఎం జగన్ ద్రోహం చేశారని విమర్శించారు. జగన్ నిర్ణయంతో రాయలసీమ రైతాంగానికి ఉరితాడు పడిందని, నీటి వాటాపై హక్కులు కోల్పోయామన్నారు. మోదీ, మమత, స్టాలిన్ తదితరులు ఎన్నికల సభల్లో పాల్గొంటుంటే సీఎం జగన్కు మాత్రం కరోనా భయంట.. అంటూ దేవినేని ఎద్దేవా చేశారు.