ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి సంబంధించిన ఓ వీడియోను టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మార్ఫింగ్ చేశారన్నది ఏపీ సీఐడీ ఆరోపణ. వైసీపీ నేత ఒకరి ఫిర్యాదుతో వెంటనే రంగంలోకి దిగిన ఏపీ సీఐడీ, దేవినేని ఉమపై కేసు నమోదు చేసింది, నోటీసులు పంపింది.. దేవినేని ఉమ కోర్టును ఆశ్రయించి, అరెస్టు నుంచి తప్పించుకున్నారు. నిన్ననే విచారణకు కూడా హాజరయ్యారు.
ఈ క్రమంలో దేవినేని ఉమ మీద ఏపీ సీఐడీ ప్రశ్నల వర్షం కురిపించింది. వీడియో మార్ఫింగ్ చేశారా.? లేదా.? ఎవరైనా చేయమన్నారా.? చేయించి ఇచ్చారా.? అంటూ ప్రశ్నించారట ఏపీ సీఐడీ అధికారులు. అయితే, దేవినేని ఉమ నుంచి ఎలాంటి సమాధానాలూ రాలేదట.. దాదాపు 10 గంటల విచారణలో. ఇంకోపక్క, చంద్రబాబే ఆ పని చేయించారని ఒప్పుకోవాల్సిందిగా ఏపీ సీఐడీ తనపై ఒత్తడి తెచ్చిందని దేవినేని ఉమ అంటున్నారు.
మార్ఫింగ్.. ఇటీవలి కాలంలో సర్వసాధారణమైపోయిన వ్యవహారం. ‘ఫేక్ బ్యాచ్’ అన్న ట్యాగ్ టీడీపీ మీదనే కాదు, వైసీపీ మీద కూడా గట్టిగానే వుంది. అధికార వైసీపీ, ఏకంగా దినసరి కూలీల తరహాలో సోషల్ మీడియాలో కొందర్ని నియమించి, ఫేక్ ప్రచారాలు చేస్తోందన్న ఆరోపణలు టీడీపీ నుంచి వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా తెరచి చూస్తే, మార్ఫింగ్ వీడియోలు, ఫొటోలు కోకొల్లలుగా కనిపిస్తాయి. వీటిపై ఫిర్యాదులూ కోకొల్లలే.
ఆయా రాజకీయ పార్టీలు ఫిర్యాదు చేస్తే, ఏపీ సీఐడీ అస్సలు పట్టించుకున్న దాఖలాలుండవనీ, అదే వైసీపీ ఫిర్యాదు చేస్తే.. వెంటనే అరెస్టుల పర్వం చోటు చేసుకుంటుందనీ, విపక్షాలు ఆరోపించడం చూస్తూనే వున్నాం. ఇక్కడ దేవినేని ఉమ విషయానికొస్తే, ఈ కేసు ముందు ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందోగానీ, ఏపీ సీఐడీ తన మీద వస్తున్న విమర్శలకు.. అంటే, ఇతర పార్టీల నుంచి వచ్చే మార్ఫింగ్ ఫిర్యాదుల పట్ల స్పందించడంలేదన్న విమర్శలకు.. ఖచ్చితమైన సమాధానం ఇవ్వాల్సి వుంది.