`విక్రమార్కుడు 2` దర్శకుడు ఎవరో తెలుసా?

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి అసాధారణ పాన్ ఇండియా చిత్రాలతో సంచలనాలకు తెర తీస్తున్న సంగతి తెలిసిందే. `బాహుబలి` తర్వాత ఏకంగా ఇద్దరు టాలీవుడ్ బిగ్ స్టార్ల ను ఎంపిక చేసుకుని `ఆర్.ఆర్.ఆర్` లాంటి భారీ చిత్రాన్ని చేస్తున్నారు. ఈ సినిమా హిట్టైతే జక్కన్న క్రేజ్ అమాంతం పదింతలవుతుంది. బాహుబలి అనంతరం బాలీవుడ్ దిగ్గజాలు సైతం ఆయనతో సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు. ఓ సందర్భాలో మిస్టర్ పర్ పెక్షనిస్ట్ అమీర్ ఖాన్ ఐయామ్ వెయింటింగ్ అంటూ ఓపెన్ గా చెప్పారు. ఇంకా సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోలు రెడీగా ఉన్నారు. కాబట్టి జక్కన్న భవిష్యత్ ని మరింత ఘనంగా ప్లాన్ చేసుకుంటారు అనడానికి ఇవన్నీ సంకేతాలుగా భావించొచ్చు. ఆయనది హాలీవుడ్ రేంజ్ అంటూ సంచలనాల రాంగోపాల్ వర్మనే జోస్యం చెప్పారు. జక్కన్న ఏం చేసినా తనదైన మార్క్ ఉండాలి. అందులో సమ్ థింగ్ స్పెషల్ గా ఉండేలా ఆయన చూసుకుంటారు. ఈ నేపథ్యంలో రాజమౌళి రీమేక్ లు.. సీక్వెల్స్ జోలికి వెళ్లనని ఓపెన్ గానే చెప్పారు.

ప్రస్తుతం స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ `విక్రమార్కుడు -2` స్క్రిప్ట్ ని సిద్దం చేసి రెడీగా ఉన్నారు. తొలి భాగానికి దర్శకత్వం వహించిన జక్కన్న దీనిని తెరకెక్కించడానికి ఎంత మాత్రం ఆస్కారం లేదు. ఈ నేపథ్యంలో ఆ స్క్రిప్ట్ మాస్ డైరెక్టర్ సంపత్ నంది వద్దకు వెళ్లిందిట. మరి హీరో ఎవరంటే? యథావిధిగా రవితేజ అనే టాక్ వినిపిస్తోంది. `విక్రమార్కుడు` రవితేజ కెరీర్ నే మార్చేసిన చిత్రం. కాబట్టి పార్టు -2 లో కూడా ఆయన నటిస్తేనే న్యాయం జరుగుతుంది. విక్రమ్ రాథోడ్..అత్తిలి సత్తి పాత్రల్లో ప్రేక్షకులు రాజాని అంతగా ఓన్ చేసుకున్నారు. అయితే రవితేజ సంపత్ నందితో మళ్లీ పనిచేస్తారా? లేదా? అన్న దానిపైనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్ లో `బెంగాల్ టైగర్` తెరకెక్కిన సంగతి తెలిసిందే. రొటీన్ కంటెట్ సినిమా అయినా రాజా మార్క్ చిత్రమని భావించారు. ఆ రకంగా సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. వసూళ్ల పరంగా భారీగా రాబట్టకపోయినా యావరేజ్ గా నెట్టుకొచ్చింది. అయితే చివరిగా నిర్మాతల కొంత నష్టమైతే జరిగిందని అప్పట్లో ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపించింది. ఆ తర్వాత మ్యాచో స్టార్ గోపీచంద్ తో `గౌతమ్ నంద` తరకెక్కించారు. స్టైలిష్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం కూడా డివైడ్ టాక్ నే సొంతం చేసుకుంది. గోపీచంద్ ని రెండు విభిన్న పాత్రల్లో చూపించి హీరో మెప్పు పొందడంలో సంపత్ సక్సెస్ అయ్యారు.

ఆ కాన్ఫిడెన్స్ తోనే ఇద్దరి కాంబినేషన్ లో ఇటీవల `సీటీమార్` తెరకెక్కింది. అప్పటికే అవకాశాలు లేక ఖాళీగా ఉన్న సంపత్ నందికి గోపీచంద్ పిలిచి మరీ అవకాశం ఇచ్చారు. ఇటీవలే సినిమా రిలీజ్ అయింది. ఈసినిమాకు మంచి ఓపెనింగ్స్ దక్కాయి. ఈ నేపథ్యంలో మాస్ హీరోలు మళ్లీ సంపత్ వైపు చూస్తున్నారనే సంకేతాలు అందుతున్నాయి. అయితే రవితేజ `విక్రమార్కుడు -2` కోసం సంపత్ తో పనిచేస్తారా? అన్న దానిపై సందేహం వ్యక్తం అవుతుంది. రవితేజ `క్రాక్` సక్సెస్ తో పట్టాలెక్కారు. ఆ సక్సెస్ ని కొనసాగించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ప్రస్తుతం `ఖిలాడీ`..`రామారావు ఆన్ డ్యూడీ` చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండు రిలీజ్ అయి సక్సెస్ అయితే రాజా బండి స్పీడప్ అవుతుంది. అటుపై సాహసం చేసినా పర్వాలేదు. లేకపోతే మార్కెట్ పై ప్రభావం తప్పదని వినిపిస్తోంది. ఇలా ఇన్ని సందేహాల నడుమ రవితేజ.. సంపత్ నంది వైపు చూడాల్సి ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే సంపత్ కి మెగా కాంపౌండ్ లో ఓ పెద్ద స్టార్ తో పనిచేసే అవకాశం వచ్చిందనే టాక్ ఇప్పటికే వినిపిస్తోంది.