రాముడు… రావణుడు కాదు!

‘‘నాది హైదరాబాద్‌. హిందీలో పలు సీరియల్స్, వెబ్‌ సిరీస్‌లు చేశాను. కొన్ని సినిమాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గానూ చేశాను. నేను నటించిన ‘థింకిస్థాన్‌’ వెబ్‌ సిరీస్‌ చూసి ‘డర్టీ హరి’ చిత్రం కోసం ఎం.ఎస్‌. రాజుగారు నన్ను తీసుకున్నారు’’ అని శ్రవణ్‌ రెడ్డి అన్నారు. శ్రవణ్‌ రెడ్డి హీరోగా, సిమ్రత్‌ కౌర్, రుహానీ శర్మ హీరోయిన్లుగా ఎం.ఎస్‌. రాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డర్టీ హరి’. గూడూరు శివరామకృష్ణ సమర్పణలో గూడూరు సతీష్‌ బాబు, గూడూరు సాయి పునీత్, కేదార్‌ సెలగం శెట్టి, వంశీ కారుమంచి నిర్మించిన ఈ సినిమా ఫ్రైడే మూవీస్‌ అనే ఏటీటీ ప్లాట్‌ఫామ్‌ ద్వారా ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రవణ్‌ రెడ్డి మాట్లాడుతూ– ‘‘నేటి తరానికి కనెక్ట్‌ అయ్యే చిత్రం ‘డర్టీ హరి’.

జీవితంలో ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు. వాటివల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయన్నదే కథ. మనుషుల్లో అంతర్లీనంగా దాగి ఉండే చెడు, పశుప్రవృత్తిని ఎలాంటి నాటకీయత లేకుండా వాస్తవిక కోణంలో చూపించారు రాజుగారు. ఇందులో నా పాత్ర రాముడిలా, రావణుడిలా కాకుండా మధ్యస్తంగా ఉంటుంది. కథలో భాగంగా రొమాన్స్‌ ఉంటుందే కానీ, సినిమా మొత్తం బోల్డ్‌గా ఉండదు. మా సినిమా ట్రైలర్, నా పాత్ర తీరును చూసి చాలా మంది ‘అర్జున్‌రెడ్డి’ సినిమాతో పోలుస్తున్నారు. ఆ చిత్రానికి, మా సినిమాకి ఎటువంటి పోలిక ఉండదు. నేను హీరోగానే చేయాలనుకోవడం లేదు. క£ý , పాత్ర నచ్చితే సహాయ నటుడిగా కనిపించడానికి కూడా అభ్యంతరం లేదు. ప్రస్తుతం హిందీలో ఓ వెబ్‌ సిరీస్‌ చేస్తున్నా’’ అన్నారు.