నెగెటివ్‌ టాక్‌తో అలర్ట్‌ అయిన డీజే

దువ్వాడ జగన్నాథమ్‌ మొదటి ట్రెయిలర్‌కి మిలియన్ల కొద్దీ వ్యూస్‌ అయితే వచ్చాయి కానీ సినిమాపై ఎలాంటి ఆసక్తిని కలిగించలేకపోయిందనేది తెలిసిందే. పరమ రొటీన్‌గా కనిపించిన ట్రెయిలర్‌లో కనీసం వినోదం కూడా పండకపోవడంతో మరీ మూసగా వుందనే టాక్‌ వచ్చింది. డీజే ట్రెయిలర్‌కి వచ్చిన నెగెటివ్‌ టాక్‌ సంగతి ఆ చిత్ర బృందం త్వరగానే గ్రహించింది.

ట్రెయిలర్‌కి వచ్చిన వ్యూస్‌ చూసుకుని హిట్‌ అనే భ్రమలో వుండిపోకుండా, అది బాలేదనే సంగతి అంగీకరించింది. అందుకే వారం తిరగకుండా మరో ట్రెయిలర్‌ని కట్‌ చేసి ఆడియో ఫంక్షన్‌ సందర్భంగా విడుదల చేసారు. ఈ ట్రెయిలర్‌లో కథకి సంబంధించిన విషయాలు చాలా రివీల్‌ అయిపోయాయి. అయినప్పటికీ మొదటి దానితో పోలిస్తే ఇది వినోదాత్మకంగా వుందని, కామెడీ ఎక్కువ వుందని ఫీడ్‌బ్యాక్‌ వస్తోంది.

పాటలు ఎలాగో హిట్టయ్యాయి కనుక ట్రెయిలర్‌లో చూపించిన వినోదానికి తగ్గట్టుగా సినిమా వుంటే కనుక ఇది పాస్‌ అయిపోవడానికి పెద్ద సమస్య ఏమీ రాకపోవచ్చు మరి. అయితే దువ్వాడ జగన్నాథమ్‌గా బ్రాహ్మణుడి పాత్రలో బన్నీ ఏ స్థాయిలో అలరించాడనేదే ఈ చిత్ర విజయానికి దోహదపడుతుంది.