కరోనా వారిని వీరిని అని చూడకుండా అందరిని చుట్టేస్తోంది. అగ్ర రాజ్యం అమెరికాను కమ్మేసిన కరోనా ఇప్పుడు ఏకంగా వైట్ హౌస్ లోకి ప్రవేశించింది. అమెరికా ప్రథమ పౌరుడు అయిన ట్రంప్ మరియు ఆయన సతీమణి మెలానియా ట్రంప్ కు కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యిందట. ట్రంప్ ప్రధాన సలహాదారుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అవ్వడంతో ట్రంప్ దంపతులు కూడా కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్ అంటూ రిపోర్ట్ వచ్చిందట. ఈ విషయాన్ని స్వయంగా ట్రంప్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
తన సలహాదారుడు హోప్ హిక్స్ విరామం లేకుండా పని చేస్తున్నారు. ఆయన తన విధుల్లో నిమగ్నం అయ్యి ఉండగా కరోనా సోకింది.. ఇది చాలా బాధకర విషయం. నాతో పాటు మెలానియా కు కూడా టెస్ట్ చేయించిన సమయంలో ఇద్దరికి పాజిటివ్ వచ్చిందన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు నెల రోజులు ఉండగా పోటీ దారుడు అయిన ట్రంప్ కు కరోనా నిర్థారణ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇది ఖచ్చితంగా ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతుందని అంటున్నారు.
ఇప్పటికే ట్రంప్ ప్రత్యర్థి అభ్యర్థి ట్రంప్ ప్రభుత్వం కరోనాను నివారించడంలో విఫలం అయ్యిందని ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా అధ్యక్షుడికే కరోనా రావడంతో ప్రజలు ఎలా ఆలోచిస్తారు అనేది చూడాలి. వచ్చే నెలలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. రెండవ సారి అధ్యక్ష పీఠం ఎక్కాలనుకుంటున్న ట్రంప్ ను కరోనా అడ్డుకునేలా ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.