మంత్రిగా పనిచేసిన వ్యక్తికి తన చుట్టూ ఏం జరుగుతోందో తెలియకుండా వుంటుందా.? అందుకే, గత కొంతకాలంగా ఆయన నర్మగర్భమైన వ్యాఖ్యలు చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ గురించి. ఈటెల అనుమానం నిజమే అయ్యింది. గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికలు, నాగార్జున సాగర్ ఉప ఎన్నిక, ఖమ్మం అలాగే వరంగల్ కార్పొరేషన్ సహా పలు మునిసిపాలిటీలకు ఉప ఎన్నికలు.. ఇవన్నీ పూర్తయ్యాక, అత్యంత వ్యూహాత్మకంగా మంత్రి ఈటెల రాజేందర్ మీద వేటు వేశారు తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.
ముందుగా తమ పింక్ మీడియా సాయంతో ఈటెల రాజేందర్ పైన కబ్జా కథనాల్ని ప్రసారం చేయించారు.. ఆ వెంటనే, కబ్జా వ్యవహారంపై విచారణకు ఆదేశించారు.. కొద్ది గంటల సమయంలోనే, ఈటెల రాజేందర్ నిర్వహిస్తున్న వైద్య ఆరోగ్య శాఖను ఆయన్నుంచి దూరం చేశారు. ఈ వ్యవహారాలపై మంత్రి ఈటెల రాజేందర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మామూలుగా అయితే, ఆరోపణలు వచ్చినప్పుడు.. పిలిచి వివరాలు తెలుసుకుంటారు. విచారణ జరిపించి నివేదికలు తెప్పించుకుంటారు. దానికి కాస్త సమయం పడుతుంది. కానీ, ఇక్కడ జరిగింది వేరే. కుట్ర పూరిత కథనాలు, ఆ తర్వాత పదవులకు దూరం చేయడం.. ఇలా నడుస్తోంది.
20 ఏళ్ళలో నేను చేయని అవినీతి.. రాత్రికి రాత్రి చేసేశానా.?’’ అంటూ ఈటెల రాజేందర్ వాపోయారు. తెలంగాణ సమాజం ప్రస్తుత పరిణామాల్ని జాగ్రత్తగా గమనిస్తోందనీ, తెలంగాణ ఉద్యమంలో పనిచేసినవారి పట్ల కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్న తీరు అందరికీ అర్థమవుతోందనీ ఈటెల రాజేందర్ చెప్పుకొచ్చారు.
తన వెనకాల ఏం జరుగుతున్నదీ ఇప్పటిదాకా తాను గమనించుకోలేదన్న ఈటెల, అన్ని విషయాలూ త్వరలోనే తెలుసుకుంటానని అన్నారు. కార్యకర్తలు, అనుచరులు, ముఖ్య నేతలతో చర్చించి, భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని అన్నారాయన. ఇప్పటిదాకా ఈటెల రాజేందర్ నిర్వహించిన వైద్య ఆరోగ్య శాఖ, ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు వెళ్ళింది. గవర్నర్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. మరోపక్క, ఈటెల రాజేందర్.. ప్రస్తుతానికి శాఖ లేని మంత్రి అయ్యారు. ఆ మంత్రి పదవి ఊడిపోవడం కూడా కొద్ది గంటల్లోనే జరగొచ్చు.