ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో రఘురామకృష్ణరాజు, తెలంగాణలో ఈటెల రాజేందర్.. అధికార పార్టీలైన వైఎస్సార్ కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. నర్సాపురం ఎంపీగా 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన రఘురామ, వైసీపీకి దూరమయ్యారు. తెలంగాణ రాష్ట్ర సమితిలో కీలక నేత అయిన ఈటెల రాజేందర్, ఇటీవల మంత్రి పదవి పోగొట్టుకున్నారు.. పార్టీ నుంచి దాదాపుగా గెంటివేయబడ్డారు. అయినా, అటు రఘురామరాజుని వైసీపీ సస్పెండ్ చేయడంలేదు.. ఇటు ఈటెల రాజేందర్ విషయంలో టీఆర్ఎస్ కూడా సస్పెండ్ చేసేందుకు సాహసించడంలేదు. ఇంతటి అసమర్థత అధికార పార్టీల్లో వుండడం ఆశ్చర్యకరమే.
సస్పెండ్ చేస్తే, ఆయా వ్యక్తులు తమ తమ పదవులకు రాజీనామా చేయాల్సిన అవసరం వుండదన్న కోణంలో అధికారంలో వున్న పార్టీలు మీనమేషాల్లెక్కెడుతున్నాయి. అయినా, ఒక్కరు పోతే అధికారంలో వున్న పార్టీలకు నష్టమా.? సస్పెండ్ చేయకపోతేనే నష్టం. ‘మా ఎంపీని మేం అరెస్టు చేసుకుంటే మీకు నొప్పేంటి.?’ అంటూ ఈ మధ్య రఘురామ విషయమై వైసీపీ అమాయకంగా విపక్షాల్ని ప్రశ్నించింది. మరి, ఇదే వైసీపీ.. రఘురామ మీద అవినీతి ఆరోపణలు చేసిందాయె. అవినీతి ఎంపీని వైసీపీ ఎందుకు సస్పెండ్ చేయడంలేదు.? అంటే, ఇదంతా వైసీపీ ఆడుతున్న నాటకమా.? ఇదే చర్చ ఈటెల రాజేందర్ విషయంలోనూ జరగుతోంది.
మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి సవాల్ విసిరారు. ఈటెలను ఎందుకు సస్పెండ్ చేయడంలేదు.? సస్పెండ్ చేయకుండా ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారంటే, మీమీద అనుమానాలు కలుగుతున్నాయంటూ కొండా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతున్నాయి. వ్యవస్థలెప్పుడో దిగజారిపోయాయి. రాజకీయ నాయకుల నుంచి నైతిక విలువల్ని ఆశించలేని రోజులివి.
తమ తమ పార్టీలది ఘన చరిత్ర.. తమ పాలన ఘనం.. అని చెప్పుకునే పార్టీలు, సొంత పార్టీకి చెందిన నేతలు, పార్టీకి వ్యతిరేకంగా.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదిస్తోంటే, సస్పెండ్ చేయలేనంత చేతకానితనం.. వీళ్ళు ప్రజలకి సుపరిపాలన అందించేస్తారట.. నవ్విపోదురుగాక మనకేటి.? అనేది ఇలాంటి సందర్భాల్లోనే మరి.