గాంధీలో డాక్టర్లపై దాడి.. టీఆర్‌ఎస్‌ సర్కార్‌కి కొత్త తలనొప్పి.!

వైద్యులపై దాడులు చేయడమేంటి.? సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయమిది. పైగా, కరోనా వైరస్‌ దెబ్బకి దేవాలయాలే మూతపడిన వేళ.. డాక్టర్లే దేవుళ్ళుగా మారి ప్రాణాలు పోయాల్సి వస్తోంది. ఈ క్రమంలో పలువురు వైద్యులు ప్రాణాలు కోల్పోతున్నారు కూడా. ఎక్కడో గల్ప్‌ దేశాల్లో మన భారతదేశానికి చెందిన ఓ డాక్టర్‌ ఒకరు కరోనాపై పోరాటంలో ఎంతోమందిని కాపాడి, తన ప్రాణాలను కోల్పోతే.. మనమంతా గర్వంతో ఉప్పొంగిపోయాం. కానీ, ఇక్కడ మనం చేస్తున్నదేంటి.?

తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆసుపత్రిగా గాంధీ ఆసుపత్రికి పేరుతంది. కరోనా వైరస్‌కి ప్రధాన చికిత్సా కేంద్రమిది తెలంగాణలో. ఇక్కడ సకల సౌకర్యాలూ వున్నాయని ప్రభుత్వం చెబుతోంది. కానీ, సౌకర్యాల లేమి గురించి ఓ జర్నలిస్ట్‌ చెప్పేదాకా అసలు విషయం బయటకు పొక్కలేదు. చివరికి ఆ జర్నలిస్ట్‌ కరోనా మహమ్మారికి బలైపోయాడనుకోండి.. అది వేరే విషయం. ఇక, గాంధీ ఆసుపత్రిలో వైద్యులపై దాడులు సర్వసాధారణమైపోయాయి. రోగుల బంధువులు వైద్యులపై దాడులు చేయడం కొత్తేమీ కాదు. తెలంగాణలోనే ఈ పైత్యం ఎక్కువగా కన్పిస్తోంది.

తాజాగా మరోమారు డాక్టర్లపై రోగుల బంధువులు దాడులు చేయడంతో, డాక్టర్లు రోడ్డెక్కారు. ‘సౌకర్యాలు సరిగ్గా లేకపోయినా, ప్రాణ భయం వెంటాడుతున్నా మేం వైద్యం చేస్తున్నాం.. మా ప్రాణాల్ని పణంగా పెట్టి, కరోనా బాధితుల ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాం. అందుకు మాకు ఇచ్చే గౌరవం ఇదేనా.?’ అంటూ జూనియర్‌ డాక్టర్లు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. ‘ముఖ్యమంత్రిగారూ ఒక్కసారి గాంధీ ఆసుపత్రికి వచ్చి ఇక్కడి పరిస్థితిని చూడండి..’ అని మొరపెట్టుకుంటున్నారు.

‘గాంధీ ఆసుపత్రిలో పేషెంట్ల వద్దకు వారి బంధువులు రావడానికి వీల్లేదు. కానీ, పోలీసుల్ని సరిగ్గా నియమించడంలేదు.. భద్రత కరవైంది. కరోనా పేషెంట్ల దగ్గరకు బంధువులు యధేచ్చగా వస్తున్నారు. వారిని మేం వారించే ప్రయత్నం చేస్తే దాడులు చేస్తున్నారు..’ అని జూడాలు వాపోతున్నారు.

డాక్టర్లపై దాడులు చేస్తే కరినంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం పలుమార్లు హెచ్చరిస్తున్నా, ప్రభుత్వ హెచ్చరికలు పట్టడంలేదు కొంతమందికి. పైగా, గాంధీ ఆసుపత్రి వద్ద సరైన భద్రత లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఓ డాక్టర్‌ సేవలకు వెల కట్టలేం. దేవుడికి కాదు, ముందు డాక్టర్లకు పూజలు చేయాలి. డాక్టర్లకు పూజ చేయకపోయినా ఫర్వాలేదు.. ఆ డాక్టర్‌కి భద్రత కల్పించకపోతే.. మొత్తంగా సమాజమే నాశనమైపోతుంది. ప్రభుత్వం ఈ విషయంలో డాక్టర్లకు అండగా వుండాలి.. వారికి పూర్తి భద్రత, భరోసా ఇవ్వాల్సి వుంది. దాడులకు పాల్పడుతున్నవారిపై కరిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.