పురాణాలు, ప్రేమకథ, యాక్షన్, సెంటిమెంట్ సినిమాలు తీయడంలో దర్శకుడు గుణశేఖర్ దిట్ట. సోగసు చూడతరమా, రామాయణం, చూడాలని ఉంది, ఒక్కడు.. ఇలా అనేక జోనర్లలో సినిమాలు తీసి అగ్ర దర్శకుల్లో ఒకరిగా నిలబడ్డారు. అయితే.. ఇన్ని జోనర్లలో సినిమాలు తెరకెక్కించిన ఆయన చారిత్రమ కథాంశాలను కూడా అద్భుతంగా తెరకెక్కించగలను నిరూపించుకున్నారు. వ్యయప్రయాసలకు ఓర్చి గుణశేఖర్ తెరకెక్కించిన ఆ చారిత్రక కథాంశమే ‘రుద్రమదేవి’. 2015 అక్టోబర్ 9న విడుదలైన ఈ సినిమా నేటితో 5 ఏళ్లు పూర్తి చేసుకుంది.
రుద్రమదేవి గురించి కొంతవరకే తెలిసిన ప్రజలకు సినిమా ద్వారా ఆమె వీరగాధను చెప్పారు గుణశేఖర్. రుద్రమదేవిగా అనుష్క అసాధారణ నటనను ప్రదర్శించింది. రుద్రమదేవిగా ఆ పాత్రకు ప్రాణప్రతిష్ట చేసిందంటే అతిశయోక్తి కాదు. మరో ముఖ్యపాత్రలో గోన గన్నారెడ్డిగా నటించిన అల్లు అర్జున్ సినిమాకే హైలైట్ నిలిచారు. రుద్రమదేవి వీరగాధను సినిమాలో గుణశేఖర్ చూపిన విధానానికి ప్రేక్షకులు ముగ్దులయ్యారు. 3డీ టెక్నలజీతో సినిమా తెరకెక్కించి ప్రేక్షకుల్ని కాకతీయుల కాలంలో ఉన్న అనుభూతి తీసుకొచ్చారు గుణశేఖర్.
కలెక్షన్లపరంగా కూడా రుద్రమదేవి 100 కోట్లు పైగా వసూలు చేసి సంచలనం రేపింది. ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా ఈస్థాయి కలెక్షన్లు సాధించడం అదే ప్రధమం. రుద్రమదేవి వీరత్వం గురించి మెగాస్టార్ చిరంజీవి తన వాయిస్ ఓవర్ తో గాంభీర్యం తీసుకొచ్చారు. ఇళయరాజా సంగీతం సినిమాకు ఎస్సెట్. గుణశేఖర్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన ఈ సినిమా పలు అవార్డులు సాధించి తెలుగు సినిమా ఖ్యాతి పెంచింది.