కొన్ని రోజులుగా హరీష్ శంకర్, బండ్ల గణేష్‌ల మధ్య ఒక వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ‘గబ్బర్ సింగ్’ దర్శకుడు, నిర్మాతల మధ్య ఎందుకు పొరపొచ్ఛాలు వచ్చాయన్నది ఇప్పటిదాకా ఎవరికీ తెలియదు. హరీష్ రీమేక్‌లతో తప్ప హిట్లు కొట్టలేడని బండ్ల కామెంట్ చేయడం.. దానికి హరీష్ దీటుగా బదులివ్వడం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బండ్ల మాట్లాడుతూ హరీష్ శంకర్‌తో ఇక ఎప్పటికీ తాను సినిమా తీయబోనని ప్రకటించాడు. దీనికి హరీష్ ఏమీ స్పందించకుండా సైలెంటుగా ఉన్నాడు. ఐతే ఉన్నట్లుండి ఈ గొడవలోకి నిర్మాత పొట్లూరి వరప్రసాద్ తలదూర్చడం గమనార్హం. బండ్ల పేరెత్తకుండా అతడి మీద సెటైర్లు గుప్పిస్తూ ఒక ట్వీట్ వేశాడు పీవీపీ.
‘‘పైనున్న అమ్మవారు కిందున్న కమ్మవారు అంటూ మా బెజవాడను బ్రహ్మాండంగా చెప్పావు హరీష్. బ్లేడ్ బాబు ఇకపై నీతో సినిమా తియ్యడట. వాడు యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్ కూడా తీయలేడు. నీకేమో నేనే కాక డజన్ల మంది నిర్మాతలు, మిరపకాయను మించి దువ్వాడను దాటించే సినిమా తియ్యడానికి.. వెయిటింగ్’’ అంటూ ట్వీట్ వేశాడు పీవీపీ.
దీనికి కొనసాగింపుగా.. ‘‘హరీష్.. తమ్ముడు స్టార్ యువర కుమ్ముడు’’ అని ఇంకో ట్వీట్ కూడా వేశారాయన. ఐతే హరీష్ పీవీపీ కోరుకున్నట్లు కుమ్మేసే పంచ్‌లు ఏమీ వేయకుండా కాస్త హుందాగానే స్పందించాడు. ‘‘మీ భాష, భావం రెండూ నన్ను అలరించాయి. ఓ మనిషిని చీల్చి చెండాడడానికి ‘ఫైటే’ అక్కర్లేదు. ‘ట్వీటే’ చాలు అని నిరూపించారు. మీ రేంజ్ మ్యాచ్ చేయాలనే నా ప్రయత్నం. నా పనితనాన్ని గుర్తించినందుకు ధన్యవాదాలు’’ అంటూ బదులిచ్చాడు హరీష్.
ఇంతకీ ఈ గొడవలోకి పీవీపీ ఎందుకొచ్చాడన్న సందేహం చాలామందికి రావచ్చు. బండ్ల నిర్మించిన ‘టెంపర్’ సినిమాకు ఫైనాన్స్ చేసింది పీవీపీనే. ఐతే తనకు వెనక్కివ్వాల్సిన మొత్తంలో 7 కోట్ల దాకా బకాయి పడటంతో పీవీపీ కోర్టుకెక్కాడు. దీనిపై కేసు నడుస్తోంది. గత ఏడాది ఈ విషయంలో ఇద్దరి మధ్య వాదోపవాదాలు, కేసులు ప్రతి కేసులు నడిచాయి.