‘హలో సీఎం సార్.. నేను హరీశ్ ను మాట్లాడుతున్నా.. సిద్దిపేట జిల్లా కొడకండ్లలో కాళేశ్వరం కాల్వ వద్ద ఉన్న కూడవెళ్లి వాగులోకి గోదావరి జలాలు వదలాలని కోరుతున్నారు’ అనీ సీఎం కేసీఆర్ కు ఆర్థికమంత్రి హరీశ్ రావు వివరించారు. ఈ వాగు పరీవాహక ప్రాంతాల్లో ఉన్న బోరుబావుల్లో నీటిమట్టం తగ్గి 11వేల ఎకరాల్లో వరిపంట ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని.. మీరు అనుమతిస్తే కొడకండ్ల కాల్వ నుంచి గోదావరి జలాలు వదులుతామని విన్నవించారు.
ఆదివారం గజ్వేల్ మార్కెట్ యార్డులో శెనగల కొనుగోలు కేంద్రాన్ని హరీశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు హరీశ్ కు తమ సమస్య వివరించారు. దీంతో స్పందించిన హరీశ్.. వెంటనే అక్కడకు వెళ్లి పరిస్థితులు పరిశీలించారు. అనంతరం అక్కడ నుంచే సీఎం కేసీఆర్ కు ఫోన్ చేసి పరిస్థితి వివరించారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించారు. రైతుల పంటలు కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమని.. వెంటనే కాల్వల ద్వారా కూడవెల్లిలోకి వదలమని ఆదేశించారు.