నైతిక బాధ్యతతోనే నాని అందుకు అంగీకరించాడా..?

నేచురల్ స్టార్ నాని మొదటి సినిమా నుంచే నిర్మాతల హీరోగా మారిపోయాడు. ఎలాంటి సినిమా అయినా మినిమమ్ కలెక్షన్స్ వసూలు చేస్తుండటంతో నాని మార్కెట్ కూడా అమాంతం పెరిగిపోయింది. అయితే గతేడాది కరోనా ఫస్ట్ వేవ్ లాక్ డౌన్ పరిస్థితుల్లో ‘వి’ చిత్రాన్ని డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయాల్సి వచ్చింది. అప్పటికే చాలా ఆలస్యం అవడంతో నిర్మాతల శ్రేయస్సు కోరి డిజిటల్ విడుదలకు నాని అంగీకరించారు. ఈ క్రమంలో ఇప్పుడు ”టక్ జగదీష్” సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ అయ్యే పరిస్థితులు వచ్చి పడ్డాయి.

నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వం వహించిన సినిమా ”టక్ జగదీష్”. ‘నిన్ను కోరి’ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అందరూ మంచి అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఏప్రిల్ 23న రిలీజ్ అవ్వాల్సిన ఈ చిత్రం కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో పోస్ట్ పోన్ అయింది. ఈ క్రమంలో నాని మూవీని ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు అనేక కథనాలు వచ్చాయి. నాని అండ్ టీమ్ మాత్రం వాటిని ఖండిస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ థియేటర్లలోనే వస్తామని చెబుతూ వచ్చారు.

ఇప్పుడిప్పుడే థియేటర్లు తెరుచుకుంటున్నా ఇండస్ట్రీలో పరిస్థితులు మాత్రం ఇంకా సాధారణ స్థితికి రాలేదు. కరోనా థర్డ్ వేవ్ భయంతో జనాలు సినిమా హాళ్లకు రావడానికి ఆలోచిస్తున్నట్లు ఈ మధ్య రిలీజ్ అయిన చిత్రాలకు వచ్చిన రెస్పాన్స్ ని బట్టి అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ లో టికెట్ ధరలు మరియు నైట్ కర్ఫ్యూలు కూడా ప్రతికూల అంశాలుగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో నాని మరియు మేకర్స్ కలిసి కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇన్నాళ్లు ఓపిక పడుతూ వచ్చిన ‘టక్ జగదీష్’ సినిమాను ఓటిటికి ఇవ్వడానికి నిర్మాతలు రెడీ అయ్యారని తెలుస్తోంది.

ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోతో ‘టక్ జగదీష్’ 37 కోట్లకు బేరం కుదుర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఓటీటీ అగ్రిమెంట్ కూడా అయిందని టాక్ నడుస్తున్నా.. మనకందిన సమాచారం ప్రకారం డీల్ ఇంకా మాటల్లోనే ఉందని.. పేపర్ మీదకు రాలేదని తెలుస్తోంది. కాకపోతే పరిస్థితులను బట్టి మేకర్స్ ఓటీటీకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. థియేటర్ లోనే తన సినిమాను రిలీజ్ చేయాలని ఇప్పటి వరకు ఎదురు చూసిన హీరో నాని.. ప్రస్తుత పరిస్థితులు నిర్మాతల ఆర్థికపరమైన అంశాల దృష్ట్యా ‘టక్ జగదీష్’ చిత్రాన్ని ఓటీటీ రిలీజ్ చేయడానికి అంగీకరించారని టాక్.

సినిమా విడుదల లేట్ అయితే ఏ నిర్మాతకైనా వడ్డీల భారం పడుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ప్రొడ్యూసర్స్ సపోర్ట్ గా ఉండటం హీరోల నైతిక బాధ్యత. ఇప్పుడు నాని కూడా తన సినిమాని థియేటర్లలోనే ప్రేక్షకులకు చూపించాలని ఉన్నప్పటికీ.. నైతిక బాధ్యతతోనే అలాంటి నిర్ణయం మద్దతు తెలిపి ఉంటారు. ఏదేమైనా ‘టక్ జగదీష్’ సినిమా విడుదల వేదికపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

కాగా ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ‘టక్ జగదీష్’ చిత్రంలో నాని సరసన రీతూ వర్మ – ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్ లుగా నటించారు. జగపతి బాబు – నాజర్ – డేనియల్ బాలాజీ – ప్రియదర్శి – తిరువీర్ – రోహిణి – ప్రవీణ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ అందించగా.. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ వర్క్ చేశారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి – హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు.