సంచలనం: ఏపీ పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేసిన హైకోర్టు

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన పరిషత్ ఎన్నికల విషయమై హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. పరిషత్ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏప్రిల్ 1వ తేదీన ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. కరోనా నేపథ్యంలో పరిషత్ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదంటూ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేయగా, కొత్త ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీ, పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజునే నోటిఫికేషన్ వెల్లడించడం వివాదాస్పదంగా మారిన విషయం విదితమే.

నిజానికి, పరిషత్ ఎన్నికలు గత ఏడాదిలోనే జరగాల్సి వుంది. కరోనా నేపథ్యంలో అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ, ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అది రాష్ట్ర ప్రభుత్వానికి నచ్చలేదు. నిమ్మగడ్డను తొలగించేందుకు ఎన్నికల సంస్కరణల పేరుతో ఆర్డినెన్సు కూడా తెచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. కొత్త ఎన్నికల కమిషనర్ కనకరాజ్ పదవీ ప్రమాణ స్వీకారం కూడా జరిగింది. అయితే, ఆ నియామకం చెల్లదని రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేయడంతో తిరిగి నిమ్మగడ్డ, ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించారు.

కరోనా కాస్త నెమ్మదించడంతో స్థానిక ఎన్నికల ప్రక్రియ పునఃప్రారంభమయ్యింది. పంచాయితీ, మునిసిపల్ ఎన్నికలు జరిగాయి. ఇంతలోనే కరోనా సెకెండ్ వేవ్ షురూ అయ్యింది. సుప్రీం తీర్పు నేపథ్యంలో పరిషత్ ఎన్నికల తేదీల ప్రకటనకు నాలుగు వారాల ముందు నోటిఫికేషన్ వెల్లడించాల్సి వుండగా, ఆ ఆదేశాల్ని తుంగలో తొక్కి, రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా పరిషత్ ఎన్నికలకు సిద్ధమయ్యింది. అందుకు తగ్గట్టుగానే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీ నోటిఫికేషన్ విడుదల చేశారు.

మొత్తమ్మీద, పోలింగ్ పూర్తయ్యాక.. ఇప్పుడు ఆ నోటిఫికేషన్ రద్దు అవడమంటే.. ఇది నిజంగానే పెను సంచలనం. మరి, ఈ వ్యవహారంపై రాష్ట్రప్రభుత్వం తదుపరి ఎలాంటి ముందడుగు వేస్తుంది.? వేచి చూడాల్సిందే.