మనోడి హత్యపై హిల్లరీ రియాక్ట్ అయ్యారు

జాత్యాంహకార వ్యాఖ్యలతో తెలుగోడిని హత్యను చేసిన వైనం పెను సంచలనంగా మారింది. ఈ ఉదంతంపై చివరకు అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసిన హిల్లరీ క్లింటన్ సైతం రియాక్ట్ అయ్యారు. ట్రంప్ మీద పోటీ చేసి అనూహ్యంగా ఓటమిపాలైన ఆమె.. తెలుగు ఐటీ ఇంజనీర్ కూఛిబొట్ల శ్రీనివాస్ హత్య జరిగిన తీరును తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జాతి విద్వేష నేరాలపై ట్రంప్ నోరు విప్పాల్సిందేనని ఆమె డిమాండ్ చేశారు.

శ్రీనివాస్ హత్యకు ఏం సమాధానం చెబుతారంటూ ట్రంప్ ను సూటిగా ప్రశ్నించిన హిల్లరీ.. దేశంలో బెదిరింపులు.. జాతి విద్వేష నేరాలు పెరిగిపోతున్నాయని.. అమెరికా అధ్యక్షుడు తన పని తాను చేయాలని మనం చెప్పాల్సిన అవసరం లేదని ఆమె ట్వీట్ చేశారు. తన ట్వీట్ కు హిల్లరీ.. శ్రీనివాస్ సతీమణి సునయిన ప్రెస్ మీట్ మీడియా క్లిప్ కూడా జత చేయటం గమనార్హం.
తన భర్త మరణం తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన శ్రీనివాస్ సతీమణి సునయిన.. అమెరికాలో భారతీయుల భద్రత గురించి సూటిగా ప్రశ్నించటమే కాదు.. పెద్ద చర్చకు తెర తీశారు కూడా. ఆమె సంధించిన ప్రశ్నపై అమెరికా సమాజంలో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇటీవల కాలంలో పెరిగి జాతివిద్వేష దాడులు.. ఇతర నేరాలపై చర్చతో పాటు.. ట్రంప్ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది.

అయితే.. ఈ ఉదంతంపై ట్రంప్ ఇప్పటివరకూ స్పందించలేదు. ఇదిలా ఉంటే.. విద్వేష తూటాకు బలైన శ్రీనివాస్ కూఛిబొట్ల భౌతికకాయానికి జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలు సాగుతున్నాయి. శ్రీనివాస్ భౌతికకాయాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున ప్రముఖులు.. ప్రజలు తరలివచ్చారు. శోకసంద్రంలో మునిగిపోయిన శ్రీనివాస్ కుటుంబం అంతిమ సంస్కారాల్ని పూర్తి చేస్తున్నారు (మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో). విద్వేషపు తూటాతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన శ్రీనివాస్ కూఛిబొట్ల ఆత్మకు శాంతి కలగాలని మనమంతా ప్రార్థిద్దాం.