ఈ లెక్కన ‘బాహుబలి’ 20 కోట్లు చేస్తుందా?

ఇంతకుముందు వరకు ఉత్తరాంధ్ర అలియాస్‌ వైజాగ్‌ మార్కెట్‌ అయిదారు కోట్ల రేంజ్‌లో వుండేది. బాహుబలి చిత్రానికి తొమ్మిది కోట్లు వస్తే అదే పెద్ద షేర్‌ అనుకున్నారు. అయితే సరైనోడు చిత్రానికి ఎనిమిది కోట్ల పైచిలుకు షేర్‌ రావడంతో అవాక్కయ్యారు. అల్లు అర్జున్‌ మార్కెట్‌ పెరిగిందా లేక ఉత్తరాంధ్రలో సినిమాలకి ఆదరణ ఇంకాస్త ముదిరిందా అనేది అర్థం కాలేదు.

ఖైదీ నంబర్‌ 150తో ఉత్తరాంధ్ర మార్కెట్‌ ఎంత పెరిగిందనే దానిపై క్లారిటీ వచ్చేసింది. ఈ ఏరియాలో పది కోట్ల షేర్‌ దాటిన తొలి చిత్రంగా రికార్డుకెక్కిన ఈ చిత్రం ఓవరాల్‌గా పదమూడు కోట్ల షేర్‌ సాధించి కొత్త రికార్డు సెట్‌ చేసింది.

సంక్రాంతికి విడుదలైన గౌతమిపుత్ర శాతకర్ణి, శతమానం భవతి చిత్రాలు సైతం ఈ ఏరియాలో అయిదు కోట్లకి పైగా షేర్‌ సాధించడంతో ఇక్కడ ఎంత పొటెన్షియల్‌ వుందనేది తేటతెల్లమైంది. ఈ లెక్కన బాహుబలి 2 ఇక్కడ అలవోకగా ఇరవై కోట్ల షేర్‌ వసూలు చేస్తుందని, అంచనాలని అందుకున్నా లేకపోయినా పదిహేను కోట్లు అయితే మినిమమ్‌ అని, సూపర్‌హిట్‌ అయినట్టయితే ఇరవై కోట్లు ఆడుతూ పాడుతూ వచ్చేస్తాయని ట్రేడ్‌ విశ్లేషకులు చెబుతున్నారు.

ఈమధ్య కాలంలో ఈ స్థాయిలో పెరిగిన మార్కెట్‌ ఇంకెక్కడా లేదంటే అతిశయోక్తి కాదు. నైజాంలో చాలా కాలంగా పెద్ద సినిమాలకి ఇరవై కోట్ల మార్కెట్టే కనిపిస్తోంది. ఒక్క బాహుబలి మాత్రమే అక్కడ నలభై కోట్లు చేసింది తప్ప మిగతా పెద్ద సినిమాలు ఇరవై కోట్లు దాటితే హిట్టనిపించుకుంటున్నాయి.