ఈ రోజు ఇండియా అంతా లాక్ డౌన్ నడుస్తోందంటే.. జనాలంతా ఇళ్లు దాటి బయటికి రాలేకపోతున్నారంటే అందుక్కారణం చైనా. ఆ దేశంలో పుట్టిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకుంది. ఇండియా సైతం చైనా వైరస్ ధాటికి అల్లాడుతోంది. దీని వల్ల అన్ని కార్యకలాపాలూ ఆగిపోయాయి. వ్యాపారాలు బంద్ అయ్యాయి.
బయట ఒక హోటల్ లేదు. ఒక సినిమా హాల్ లేదు. బయట అడుగు పెట్టే పరిస్థితే లేదు. ఈ మహమ్మారే లేకుంటే ఈపాటికి మన జనాలు వేసవికి రిలీజయ్యే పెద్ద సినిమాల్ని ఏసీ థియేటర్లలో ఆస్వాదిస్తూ కూర్చునేవాళ్లు. కానీ ఇప్పుడు థియేటర్లు మూతపడి.. టీవీ ఛానెళ్లలో, ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌లో పాత సినిమాలు చూసుకుంటున్నారు. కానీ చైనీయులు మాత్రం చక్కగా మళ్లీ థియేటర్లు తెరుచుకుని సినిమాలు ఆస్వాదించడం మొదలుపెట్టారు.
అక్కడ ఇండియన్ సినిమాల ప్రదర్శనకు సైతం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ‘దంగల్’ సహా కొన్ని చిత్రాలు చైనాలో వసూళ్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. అక్కడ త్వరలోనే ఓ భారీ హిందీ చిత్రం విడుదల కాబోతోంది. ఆ సినిమానే.. సూపర్ 30. బీహార్లో పేద విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ఐఐటీలకు వరుస కట్టించిన ఆనంద్ కుమార్ కథతో తెరకెక్కిన ఈ చిత్రం గత ఏడాది చక్కటి విజయం సాధించింది. హృతిక్ రోషన్ హీరోగా వికాస్ బల్ ఈ చిత్రాన్ని రూపొందించాడు.
ఈ సినిమాను చైనాలో రిలీజ్ చేయడానికి ఇంతకుముందే సన్నాహాలు జరిగాయి. కానీ అంతలో కరోనా ఎఫెక్ట్‌తో అక్కడ థియేటర్లు షట్ డౌన్ అయ్యాయి. వుహాన్‌లో గత నెలలోనే లాక్ డౌన్ ఎత్తేశారు. మిగతా చోట్ల కూడా నియంత్రణ సడలించారు. దీంతో మళ్లీ అన్ని చోట్లా సినిమాల ప్రదర్శన కొనసాగుతోంది. దీంతో సూపర్ 30 చైనీస్ వెర్షన్ విడుదలకు రంగం సిద్ధమవుతోంది. చైనీయుల వల్ల మనం కొన్ని నెలల పాటు సినిమాలు చూడలేని పరిస్థితి రాగా.. వాళ్లేమో ఈ టైంలో మన సినిమాను చూసేందుకు రెడీ అవుతుండటమే విడ్డూరం.