కీరవాణి ఇమేజ్‌కు భారీ డ్యామేజే..

ఎం.ఎం.కీరవాణి.. తెలుగువాళ్లు గర్వించదగ్గ సంగీత దర్శకుడు. ఆయనపై అభిమానంతో పాటు గౌరవభావమూ ఉండేది సంగీత ప్రియుల్లో. తన సంగీత ప్రతిభతో పాటు మాటతోనూ ఆయన అందరి నుంచి గౌరవం దక్కించుకున్నారు. ఐతే మొన్నటి ట్వీట్ల వర్షంతో ఆయన ఇమేజ్ బాగా డ్యామేజ్ అయిపోయింది. ‘బాహుబలి: ది కంక్లూజన్’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ముందు ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారమే రేపాయి.

తాను పని చేసిన దర్శకుల్లో చాలామంది బుర్ర లేని వాళ్లని.. వేటూరి, సీతారామశాస్త్రిల తర్వాత తెలుగు సినిమా సాహిత్యం అంపశయ్య పైకి చేరిందని ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కీరవాణిపై చెలరేగిన విమర్శల మంటలు ఇంకా ఆగలేదు. ఇప్పటికీ సోషల్ మీడియాలపై ఆయనపై విమర్శల దాడి కొనసాగుతోంది. రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్నందుకు హర్షం వ్యక్తమవుతుందనుకుంటే.. మీరు రిటైరైతే ఎవరికి నష్టం.. శుభ్రంగా రిటైరైపోండి అంటూ కీరవాణికి పంచ్‌లు ఇస్తున్నారు నెటిజన్లు.

ఇక సినీ పరిశ్రమలోనూ కీరవాణిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాను కొందరు దర్శకుల వల్ల ఇబ్బంది పడ్డాననో.. గతంతో పోలిస్తే సినీ సాహిత్య ప్రమాణాలు తగ్గాయనో చెప్పాలి కానీ.. మరీ అంత తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేయాలా అంటూ ఆయనపై ప్రత్యక్షంగా.. పరోక్షంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయనది అహంకార స్వరం అని దుయ్యబడుతున్నారు.
నిజానికి ‘బాహుబలి: ది కంక్లూజన్’ కోసం మంచి ఆడియో ఇచ్చిన కీరవాణిపై ప్రశంసల జల్లు కురుస్తుండాలి. కానీ ఆయన వ్యాఖ్యల పుణ్యమా అని ఆ ఆడియో సంగతి పక్కకు వెళ్లిపోయింది. చాలామంది ఆయన్ని టార్గెట్‌గా చేసుకున్నారు. రాజమౌళి వినమ్రత గురించి గొప్పగా చెప్పే కీరవాణి.. తాను మాత్రం అలా ప్రవర్తించలేకపోవడం విచారకరం.