మహేష్ 23, పవన్ 23కి ఆకాశమే హద్దు

‘ఖైదీ నంబర్ 150’తో ఒక విషయం రుజువైంది. భారీ అంచనాలతో వచ్చిన చిత్రం ప్రేక్షకులతో డీసెంట్ అనిపించుకున్నట్టయితే కలక్షన్లు వాటంతట అవే వచ్చి పడిపోతాయని. వంద కోట్ల షేర్ సాధించడం అంత కష్టమేం కాదని ఇప్పుడు ‘ఖైదీ నంబర్ 150’ గురించి ట్రేడ్ అంటోంది. తర్వాత రాబోయే భారీ చిత్రాలకి ఇప్పటికే క్రేజ్ పతాక స్థాయిలో వుంది.

బాహుబలి 2కి ఎలాగో రచ్చ ఓ రేంజ్లో వుంటుంది కనుక నెక్స్ట్ రాబోయే భారీ సినిమాల్లో మహేష్ నటిస్తున్న 23వ చిత్రానికి స్కోప్ ఎక్కువ వుంది. మురుగదాస్ డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రం మూడు భాషల్లో విడుదల కానుంది కనుక దీనికి భారీ కలక్షన్లు ఖాయమనే అంచనాలున్నాయి.

ఈ చిత్రానికి మూడు భాషల్లో కలిపి నూట యాభై కోట్ల బిజినెస్ జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇక పవన్ 23వ చిత్రం త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కనుంది. అత్తారింటికి దారేది కాంబినేషన్లో వచ్చే ఈ చిత్రంపై కూడా వంద కోట్లకి తక్కువ బిజినెస్ జరిగే సమస్యే లేదు. ఈ రెండు చిత్రాలు కనుక నిజంగా అంచనాలని అందుకున్నట్టయితే, పెరిగిన మార్కెట్ లెక్కల ప్రకారం వీటికి ఆకాశమే హద్దు. అయితే రెండు సినిమాలకీ రిలీజ్ టైమింగ్ కూడా కలిసి రావాలనుకోండి.

మహేష్ 23ని వేసవిలో విడుదల చేద్దామని చూస్తున్నారు కానీ బాహుబలి 2 డేట్ మీద అది డిపెండ్ అవుతుంది. పవన్ చిత్రాన్ని దసరాకి విడుదల చేయాలనేది అసలు ప్లాన్. కాస్త లేట్ అయితే వచ్చే సంక్రాంతికి మాత్రం తప్పకుండా వచ్చేస్తుంది.