30 రోజుల బిడ్డతో డ్యూటీకి తెలుగు ఐఏఎస్

ఎవరో అవినీతికి పాల్పడ్డారు. ఇంకెవరో కొందరు నిర్లక్ష్యంగా ఉన్నారు అని… ప్రభుత్వ వ్యవస్థ సరిగా పనిచేయట్లేదు అని మొత్తం అందరినీ ఒకేగాటన కట్టడం చాలా మందికి అలవాటు. అధికారులు అంటే పని ఎగ్గొట్టి లంచాలు తీసుకునే వారు అని చాలామంది ముద్ర వేస్తారు.

అలాంటి వారు వ్యవస్థలో కొందరు ఉండొచ్చు… కానీ నెగిటివిటీ గురించి ప్రచారం జరిగినంత మంచి గురించి జరగదు. నిన్న భర్త ఆరోగ్య శాఖలో, భార్య పోలీసు శాఖలో ఉండి పిల్లాడిని చూసుకునే వారు ఎవరూ లేక ఐదేళ్ల కొడుకుని డ్యూటీకి తీసుకొచ్చిన బాధ్యత గల మహిళా ట్రాఫిక్ పోలీసులను చూశాం. అది విజయవాడలో జరిగింది.

తాజాగా ఒక ఐఏఎస్ అధికారి తనకు ప్రభుత్వం ఇచ్చే వెసులు బాటును, హక్కును కూడా వాడుకోకుండా ప్రజలకు సేవ చేయడానికి 30 రోజుల పసిబిడ్డతో డ్యూటీలో చేరి హ్యాట్సాఫ్ అనిపించుకుంది. విశాఖ నగర కమిషనర్ అయిన గుమ్మళ్ల సృజన ఇటీవలే ఓ బిడ్డకు జన్మనిచ్చింది.

ప్రభుత్వ అధికారులకు కాన్పు తర్వాత 6 నెలల మ్యాటర్నిటీ లీవు ఉంటుంది. అంటే ఆమె మరో ఐదు నెలల పాటు విధులకు హాజరు కావల్సిన అవసరం లేదు. కానీ తాను కమిషనర్ అయి ఉండి ఇంత కష్టకాలంలో ప్రజలకు అందుబాటులో లేకపోతే ఇంకెప్పుడు ఉంటుంది నా అవసరం? అంటూ లీవు అవసరం లేదని చెప్పి విధుల్లో చేరింది. నెల బిడ్డను పొత్తిళ్లలో పెట్టుకుని విశాఖ నగర పరిపాలన బాధ్యతలను నిర్వర్తిసున్నారు ఈ మహా తల్లి.

కరోనా నానాటికీ విస్తరిస్తున్న నేపథ్యంలో ఐఏఎస్ అధికారులు దేశ వ్యాప్తంగా కీలకంగా వ్యవహరిస్తున్నారు. కరోనాను అరికట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మానవ చరిత్రలో ఇది అత్యంత క్లిష్టమైన సమయం. అందుకే ఈ కీలక సమయంలో తన బాధ్యతల నుంచి అవకాశం వచ్చిందని ఎస్కేప్ అవడానికి ఏ మాత్రం ఆమె ప్రయత్నం చేయలేదు.

తోటి వారు వారిస్తున్నా ఆమె పర్వాలేదు నేను హ్యాండిల్ చేయగలను అంటూ ధైర్యంగా విధుల్లో దిగారు. ఇలాంటి బాధ్యతాయుతమైన వ్యక్తుల వల్లేనేమో భారత్ కరోనా కట్టడిలో మెరుగైన పనితీరు కనబరుస్తోంది. సెల్యూట్ హర్ !