సుస్వరాల పూదోటలో ఐదు దశాబ్ధాల కాలంగా మ్యాస్ట్రో ఇళయరాజా ఒక విహారిగా కొనసాగిన తీరు అసాధారణం. ఆయనను సంగీత జ్ఞాని అని ప్రపంచం కీర్తించింది. ఆయన స్వరాల లాలిత్యం గురించి వర్ణించడం అనితర సాధ్యం. ఎన్నో సినిమాలకు సంగీతం అందించి సంగీతం ప్రపంచంలో తనదైన ముద్రను వేసారు. నేటితరం యువ సంగీత దర్శకులకు ఆయనో స్ఫూర్తి. నేటికి 78 వయసులోనూ ఆయన ఇంకా సినిమాలకు పనిచేస్తూ నిరంతర శ్రమ జీవిగా ఘనుతికెక్కారు. తనయులు సంగీత దర్శకులుగా మారినప్పటికీ మ్యాస్ట్రో వాళ్లతోనూ పోటీ పడుతున్నారు. తాజాగా కోడం బాక్కం హైరోడ్డులోని మహాలింగపురంలో ఇళయరాజా కొత్తగా ఓ మ్యూజిక్ స్టడియోని లాంచ్ చేసారు. ఈ నేపథ్యంలో సంగీతం గురించి…సంగీత ప్రపంచంలో ఆయన వారసత్వం గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు.
ఇప్పటివరకూ 1300 సినిమాలకు సంగీతం అందించాను. నా ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఈ రంగంలో నాది ముగింపు లేని ప్రయాణం. నా స్టూడియోల్లో ఎప్పటికప్పుడు కొత్తవారితో రికార్డింగ్ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. వాటికి ఎప్పుడూ బ్రేక్ పడలేదు. అయితే కరోనా కారణంగా మ్యూజిక్ కంపోజింగ్స్ నెమ్మదిగా జరుగుతున్నాయి. ఇక లాక్ డౌన్ సమయంలో సంగీతం ఎంతో మందికి ఉపశమనం కలిగించింది. డాక్టర్లు సంగీతాన్ని మెడిసిన్ గా భావించారంటే అంటే సంగీతానికి ఎంతప్రాధాన్యత ఉందో అర్థమవుతుంది.
రెండు దశాబ్ధాల క్రితం కంపోజ్ చేసిన పాటలు ఇప్పటికీ వింటున్నారంటే అదే సంగీతం గొప్పదనం. సంగీతం అనేది రోజు తర్వాత వాడిపోయే పువ్వులా ఉండకూడదు. అప్పుడే పొడుచుకొచ్చిన మొగ్గలా ఉండాలి. ఎందుకంటే మనసు ఎప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటుంది. ఆ కొత్తదనాన్ని సంగీతం మాత్రమే అందించగలదు. నా కుమారులైన యువన్ శంకర్ రాజా- కార్తీక్ రాజ్ ల పిల్లలు యతీశ్వరన్.. జియాలకు సంగతం అనేది పుట్టుకలోనే ఉంది. అందుకే ఇప్పుడు వారు అందరి ప్రశంసలు దక్కించుకుంటున్నారు. ఇది తనకు ఎంతో సంతోషాన్నిస్తుందని ఇళయరాజా తెలిపారు. ఇక ఇళయరాజా సంగీతానికి రిటైర్మెంట్ అనేది ఇవ్వరని అర్థమవుతోంది. సినిమాలకు పనిచేస్తూ…మ్యూజిక్ కచేరిలతోనూ మ్యాస్ట్రో ఎప్పుడూ బిజీగా ఉంటారు.
స్వర జ్ఞాని స్వగతం:
స్వర జ్ఞాని.. ఇసై జ్ఞాని ఎలా పిలిచినా ఇళయరాజాకి మాత్రమే ఆ పిలుపు అందుకునే అర్హత ఉంది. స్వరరాజుగా పాటల పూదోటలో విహరించిన ఆయన దశాబ్ధాల పాటు తన స్థాయిని నిలబెట్టుకున్నారు. పలు భాషల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు సంగీతం అందించారు. ఇప్పటికీ ఇళయరాజా తెలుగు క్లాసిక్స్ కి యువతరంలో అసాధారణ ఫాలోయింగ్ ఉంది.
తెలుగు- తమిళం- మలయాళం- హిందీ- కన్నడ- మరాఠీ భాషల్లో వెయ్యికి పైగా సినిమాలలో దాదాపు 1300 సినిమాల్లో 5000కు పైగా పాటలకు సంగీతం అందించారు. ఎక్కువగా తమిళ సినిమాలు చేశారు. ఆయన సంగీతం అంటే చెవికోసుకునేంత క్రేజు. అందుకే ఎన్నో క్లాసిక్ హిట్స్ కెరియర్ లో ఉన్నాయి. ఇక రాజా రీరికార్డింగ్ ట్యాలెంట్ వేరొక సంగీత దర్శకుడిలో చూడలేం. తెలుగులో సాగర సంగమం- సీతకోక చిలుక- రుద్రవీణ- అభినందన- ఘర్షణ వంటి క్లాసిక్స్ కి సంగీతం అందించారు. బాలకృష్ణ కథానాయకుడిగా బాపు దర్శకత్వం వహించిన శ్రీరామరాజ్యం చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించిన సంగతి తెలిసిందే.
వీటన్నిటినీ మించి 78 వయసులోనూ ఇళయరాజా హెల్దీ లైఫ్ సర్ ప్రైజింగ్ అనే చెప్పాలి. సుస్వర సామ్రాజ్యపు రారాజుగా.. సంగీత సాధనతో అతడి వయసును తగ్గించిందా? అంటే అవుననే అర్థమవుతోంది.