ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో ఒకటి కరోనా కాగా, రెండోది లాక్ డౌన్. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు లాక్ డౌన్ ను మించిన మార్గం లేదని చాలా దేశాలు ‘తాళం’ వేశాయి. ఫలితంగా వైరస్ వ్యాప్తిలో వేగం తగ్గిన మాట నిజం. కానీ కేసుల నమోదు మాత్రం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ఇలా ఎన్నాళ్లు పొడిగించాలనే అంశంపై పలు దేశాలు తర్జనభర్జన పడుతున్నాయి. వేసిన తాళాన్ని ఉంచాలా, తీయాలా అని మథనపడుతున్నాయి.
లాక్ డౌన్ ఎత్తివేస్తే వైరస్ భయం.. కొనసాగిస్తే కాసులకు కష్టం.. దీంతో ఏం చేయాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నాయి. సుదీర్ఘ కాలం లాక్ డౌన్ మంచిది కాదని, హెర్డ్ ఇమ్యూనిటినీ నమ్ముకుని ముందుకెళ్లడమే బెటరని కొంతమంది సూచనలు చేస్తున్నారు. అయితే, కేసుల సంఖ్య తగ్గింది కదా అని లాక్ డౌన్ ఎత్తివేస్తే పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరిస్తోంది.
రాబోయే కాలం చాలా కీలకమని, ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ఎత్తివేత, ఆంక్షల సడలింపులో అప్రమత్తంగా ఉండాలని స్పష్టంచేస్తోంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, ఆంక్షల సడలింపులో నిర్లక్ష్యం వహించినా ఈ మహమ్మరి విజృంభణ తప్పదని పేర్కొంటోంది. తీవ్రత తక్కువగా ఉండి గుర్తించలేని స్థితిలో ఉన్న వైరస్ మరోసారి ప్రపంచానికి పెను సవాల్ గా మారే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ఓ ఎమెర్జెన్సీ చీఫ్ మైకేల్ ర్యాన్ తెలిపారు.
కేసులు తగ్గడంతో లాక్ డౌన్ తొలగించిన జర్మనీ, దక్షిణ కొరియాల్లో ప్రస్తుత పరిస్థితి చూసైనా మిగిలిన దేశాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆంక్షల సడలింపులో కొన్ని దేశాలు ప్రణాళిక లేకుండా సాగుతున్నాయని, ఇది ఏమాత్రం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. వైరస్ ను ఎదుర్కొనే యాంటీబాడీలు చాలామందిలో ఊహించిన దాని కంటే చాలా తక్కువగా ఉన్నందున.. హెర్డ్ ఇమ్యూనిటిని నమ్ముకోవడం అంత మంచిది కాదని సంస్థ చీఫ్ టెడ్రస్ అథనోమ్ స్పష్టంచేశారు.
ఈ నేపథ్యంలో మనదేశంలో లాక్ డౌన్ కొనసాగిస్తారా, తొలగిస్తారా అనే అంశంపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం అమల్లో ఉన్న మూడో విడత లాక్ డౌన్ ఈనెల 17తో ముగియనుంది. దీనిని ఈ నెలాఖరు వరకు పొడిగించడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ప్రజా రవాణా వ్యవస్థను షరతులతో ప్రారంభించొచ్చని తెలుస్తోంది. మంగళవారం రాత్రి 8 గంటలకు ప్రధాని మోదీ జాతినుద్దేశించి మాట్లాడనున్న నేపథ్యంలో ఈ అంశాలపై స్పష్టత రానుంది.