ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఇటీవల ఏడాది పాలన పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ, ‘విధ్వంసానికి ఒక్క ఛాన్స్’ అంటూ ఏకంగా ఓ పుస్తకాన్ని విడుదల చేసింది. ‘వైఎస్ జగన్ ఏడాది పాలనపై చార్జి షీట్..’ అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్.. మీడియా సమావేశంలో జగన్ సర్కార్‌పై దుమ్మెత్తి పోశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని ఉద్దేశించి ‘జీరో సీఎం’ అంటూ అభివర్ణించిన నారా లోకేష్, రాష్ట్రంలో ‘రాజారెడ్డి రాజ్యాంగం’ అమలవుతోందంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇక, ‘విధ్వంసానికి ఒక్క ఛాన్స్’ పుస్తకం విషయానికొస్తే, మొత్తం 20 పేజీల నిడివితో ఈ పుస్తకాన్ని విడుదల చేసింది తెలుగుదేశం పార్టీ. కరోనా వైరస్ నేపథ్యంలో మాస్క్‌లు అడిగి వార్తల్లోకెక్కిన డాక్టర్ సుధాకర్.. ఈ పుస్తకం కవర్ పేజ్ బ్యాక్‌గ్రౌండ్‌లో చోటు దక్కించుకోవడం గమనార్హం.
‘ప్రజా వేదిక’ కూల్చివేత వ్యవహారాన్ని కూడా కవర్ పేజీ బ్యాక్‌గ్రౌండ్‌లో వాడారు. సిమెంటు ధరలు, ఇసుక కొరత, విద్యుత్ ఛార్జీల షాక్.. ఇలాంటి వ్యవహారాలన్నిటినీ ‘విధ్వంసానికి ఒక్క ఛాన్స్’ పుస్తకంలో టీడీపీ ప్రస్తావించింది. టీడీపీ హయాంలో తెరపైకొచ్చిన అన్న క్యాంటీన్లు, నిరుద్యోగ భృతిని వైఎస్ జగన్ సర్కార్ రద్దు చేయడంపైనా టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ పుస్తకం ద్వారా. ‘నవ రద్దులు – ‘జె’గన్’ అంటూ వైఎస్ జగన్‌పై దుమ్మెత్తిపోసిన టీడీపీ, ‘నవ మోసాలు’ అంటూ ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించింది.
ఇక, తమ హయాంలో ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకునేదనీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి, అరాచకాల గురించి అంతా మాట్లాడుకుంటున్నారని టీడీపీ నేత నారా లోకేష్ ఆరోపించడం గమనార్హం. ‘నవ స్కాంలు – దోచుకో, దాచుకో, ‘జె’ ట్యాక్స్’ అంటూ రాష్ట్రంలో హల్‌చల్ చేస్తున్న చిత్ర విచిత్రమైన మద్యం బ్రాండ్ల వ్యవహారాన్ని ప్రస్తావించింది టీడీపీ.
‘నవ రాజ్యాంగ ధిక్కరణలు – రౌడీ రాజ్యం’ అనే పేరుతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విషయంలో జరిగిన పరిణామాలతోపాటు, న్యాయస్థానాలు జగన్ సర్కార్‌కి వేసిన మొట్టికాయల వ్యవహారాన్ని పేర్కొన్నారు. మొత్తమ్మీద, వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ పోరులో మరో ముందడుగు పడినట్లే కన్పిస్తోంది. నిజానికి, ఈ తరహా పుస్తకాల వ్యవహారం ఇప్పుడు కొత్తగా తెరపైకొచ్చిందేమీ కాదు. గతంలో చంద్రబాబు మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇదే తరహాలో పుస్తకాల్ని ప్రచురించిన విషయం విదితమే. చూద్దాం, టీడీపీ పేర్కొంటోన్న ‘విధ్వంసానికి ఒక్క ఛాన్స్’పై వైఎస్సార్సీపీ నుంచి ఎలాంటి కౌంటర్ వచ్చిపడ్తుందో.
#VidhvamsaanikiOkkaChance pic.twitter.com/AYopIgJ2Mb
— Telugu Desam Party #StayHomeSaveLives (@JaiTDP) June 8, 2020
#VidhvamsaanikiOkkaChance pic.twitter.com/4sHQIvBcEB
— Telugu Desam Party #StayHomeSaveLives (@JaiTDP) June 8, 2020