ఆయనకు బలుపు లేదు.. నాకు గుల లేదు

సూటిగా సుత్తి లేకుండా మాట్లాడుతుంటాడు సీనియర్ నటుడు జగపతిబాబు. ఇండస్ట్రీలో చాలామంది దగ్గర ఉండే హిపోక్రసీ ఆయన దగ్గర కనిపించదు. ఏదైనా మొహమాటం లేకుండా మాట్లాడేస్తుంటాడు. విలన్ పాత్రలు చేయడానికి ముందు గ్యాప్ తీసుకున్నారేంటి అని అడిగితే.. ”నేను గ్యాప్ తీసుకోలేదు. ఇండస్ట్రీనే నాకు గ్యాప్ ఇచ్చింది.

అవకాశాలు లేకే ఖాళీగా ఉన్నాను” అని చెప్పడం జగపతిబాబుకే చెల్లింది. ఇలాంటి సందర్భంలో మిగతా వాళ్లు ఎలా మాట్లాడతారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇక విలన్… క్యారెక్టర్ రోల్స్‌తో కెరీర్ అద్భుతంగా సాగిపోతున్న టైంలో జగపతిబాబు మళ్లీ హీరోగా మారి ‘పటేల్ సార్’ అనే సినిమా చేయడంపైనా కొందరు సెటైర్లు వేశారు.

ఈ విషయంపైనా జగపతి బాబు స్పందించాడు. తనకు హీరో అనిపించుకోవాలనేమీ లేదని.. ఈ వయసులో తనకు హీరోగా చేయాల్సిన అవసరం కూడా లేదని.. కాకపోతే అప్పుడప్పుడూ ఇలాంటి ప్రయత్నాలు చేయకపోతే తనకు తానే బోర్ కొట్టేస్తానని జగపతిబాబు అన్నాడు.

స్వయంగా తన భార్యే ‘చక్కగా ఇప్పుడు విలన్ వేషాలు చేసుకుంటున్నారు. మళ్లీ హీరోగా ఏంటి’ అని అడిగిందని.. ఐతే ఈ కథలో ఉన్న ప్రత్యేకత వల్లే కథానాయకుడిగా నటించాల్సి వచ్చిందని జగపతిబాబు చెప్పాడు. ”నిర్మాత సాయికి ఒళ్లు బలిసి ఈ సినిమాను నిర్మించలేదు. నేనేదో గులతో ఇందులో హీరోగా నటించలేదు. జనాలు అలా ఎంతమాత్రం అనుకోని విధంగా ‘పటేల్ సార్’ ఉంటుంది” అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించాడు జగపతి.