లాక్ డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న తెలుగు కార్మికులను ఆదుకోవాలంటూ ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు, ముఖ్య నేతలకు విన్నవించి వాళ్లకు సాయం అందేలా చూసిన పవన్ కళ్యాణ్ మీద ఎలా ప్రశంసల జల్లు కురిసిందో తెలిసిందే. తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో నాయకులు, అధికారులతో మాట్లాడి ఏపీ కార్మికులను రక్షించాడు పవన్. దీంతో బయటి రాష్ట్రాల్లో ఎక్కడ మన కార్మికులు చిక్కుకున్నా ముందు పవన్ కళ్యాణ్ దృష్టికే తీసుకొస్తున్నారు నెటిజన్లు.
ఇలాంటి బాధితుల విషయంలో ఏపీ సర్కారు ఏం చేస్తోందన్నది అర్థం కావడం లేదు. ఐతే బయటి రాష్ట్రాల్లోని మన కార్మికుల్ని పట్టించుకోని ఏపీ సర్కారు.. ఏపీలో చిక్కుకున్న ఇతర రాష్ట్రాల వారి విషయంలోనూ ఇదే నిర్లక్ష్యం చూపిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. ఇందుకు ఒడిషా మంత్రి అమర్ పట్నాయక్ వెలుగులోకి తెచ్చిన ఓ ఉదంతమే నిదర్శనం.
డాక్టర్ అమర్ పట్నాయక్ అనే ఒడిషా మంత్రి.. ఆంధ్రాలో చిక్కుకుపోయిన 30 మంది ఒడిషా వాసులకు సాయం అందించాలని తమ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఏపీ ప్రభుత్వానికి పది రోజుల కిందట లేఖ రాసినా.. వారికి ఎలాంటి సాయం అందలేదని.. దీంతో అక్కడి నుంచి నడిచి ఒడిషా చేరుకునేందుకు వాళ్లు సిద్ధమయ్యారని ట్విట్టర్లో వెల్లడించారు.
బాధితుల ఫొటోలు, ఏపీ ప్రభుత్వానికి తమ చీఫ్ సెక్రటరీ రాసిన లేఖను ఆయన ట్విట్టర్లో షేర్ చేశారు. ఇది జరిగాక కూడా ఏపీ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోయింది. ఐతే వెంకటేష్ గొల్ల అనే జనసేన నాయకుడు ఈ మెసేజ్ చూసి.. ఒంగోలు జనసేన ఇన్ఛార్జి రియాజ్‌తో మాట్లాడి ఒడిషా బాధితులకు రేషన్, కూరగాయలు అందేలా చూశాడు. దీని గురించి ఒడిషా మంత్రికి ట్విట్టర్లో సమాచారం కూడా అందించాడు. దీనికి బదులుగా మంత్రి జనసేన నాయకుడికి కృతజ్ఞతలు చెప్పారు.
సోషల్ మీడియాలో కుప్పలు కుప్పలుగా ఉన్న వైకాపా మద్దతుదారులు ఇదంతా చూస్తూ ఎలా ఊరుకుంటున్నారో.. తమ ఇమేజ్‌ను డ్యామేజ్ చేసే ఇలాంటి విషయాల్లో ఏపీ సర్కారు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో అర్థం కాని విషయం.