జయలలిత ఆస్తికి వారసులెవరూ లేరా.?

సినీ నటిగా జయలలిత కీర్తి ప్రతిష్టల గురించి కొత్తగా చెప్పేదేముంది.? రాజకీయాల్లో అయితే ఆమెను అంతా ‘ఐరన్‌ లేడీ’ అనేవారు. ‘అమ్మ’గా తమిళ జనాలకు సుపరిచితురాలైన జయలలిత, రాజకీయ రంగంలో దేశ రాజకీయాలపైనా తనదైన ముద్ర వేశారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా ఆమె అందించిన సేవల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే, జయలలిత వ్యక్తిగత జీవితం తెరిచిన పుస్తకం కాదు. జయలలిత ఎవర్నీ పెళ్ళి చేసుకోలేదు. కానీ, ఆమెకూ ‘పర్సనల్‌ లైఫ్‌’ వుందంటారు. ఆమెకు ఓ కొడుకు వున్నాడని గతంలో ప్రచారం జరిగింది. అయితే, అదంతా ఉత్తదేనని పలుమార్లు ఆమె సన్నిహితులు ఖండించారు.

ఇప్పుడిదంతా ఎందుకంటే, జయలలిత ఆస్తుల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటోంది. ఈ క్రమంలో జయలలితకు చెందిన పోయెస్‌గార్డెన్‌లోని కొంత భూభాగాన్ని, ప్రభుత్వం అభివృద్ధి చేయబోతోంది. జయలలిత మెమోరియల్‌గా దాన్ని మార్చనున్నారు. అయితే, జయలలిత ఆస్తులు తనకే చెందుతాయంటూ జయలలిత మేనకోడలు ఆ మధ్య నానా యాగీ చేశారు. జయలలిత ఆస్తులపై హక్కు తనకేనంటూ జయలలిత స్నేహితురాలు శశికళ కూడా వాదించేవారు.

ఇంతకీ, జయలలిత ఆస్తులపై హక్కులు ఎవరికి.? ఈ ప్రశ్నకు సమాధానం దొరకడంలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చాలా తెలివిగా ‘పత్రికా ప్రకటన’ విడుదల చేసింది. సదరు ఆస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోబోతోందంటూ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. సో, జయలలిత ఆస్తులకు నిజమైన వారసులెవరైనా వుంటే, ఇప్పుడు మీడియా ముందుకు రావొచ్చు.. కోర్టులో సవాల్‌ చేయొచ్చు.

ఇదిలా వుంటే, జయలలిత ఎలాంటి వీలూనామా రాయలేదని కొందరు అంటోంటే, ఆమె ముందు జాగ్రత్తగా వీలూనామా రాశారనీ, దాన్ని శశికళ తన దగ్గరే వుంచుకున్నారనీ మరికొందరు అంటున్నారు. ప్రస్తుతం శశికళ జైలు శిక్ష అనుభవిస్తున్నారు అక్రమాస్తుల కేసులో. ఈ కేసులో మొదటి నిందితురాలు జయలలిత. కానీ, ఇప్పుడామె జీవించిలేరు.

ఏదిఏమైనా, జయలలితకు చెందిన వేల కోట్ల ఆస్తులు ఎవరెవరి చేతుల్లోకో వెళ్ళిపోయాయన్నది నిర్వివాదాంశం. ప్రభుత్వం, మెమోరియల్‌ ఏర్పాటు చేస్తోన్న దరిమిలా.. ఇదొక్కటే ఆమె పేరుని చరిత్ర గుర్తుంచుకునేలా మారుతుందేమో వేచి చూడాలి.