రాజశేఖర్ హీరోగా గతంలో జీవిత కొన్ని సినిమాలను తెరకెక్కించారు. దర్శకురాలిగా ఆమె మరోసారి మెగా ఫోన్ పట్టి ఆయనతో చేసిన సినిమానే ‘ శేఖర్’. ఈ సినిమాకి జీవిత రాజశేఖర్ కూడా ఒక నిర్మాతగా వ్యవహరించారు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను ఈ నెల 20వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి జీవిత మాట్లాడారు.” ఒక మర్చిపోలేని సినిమాగా ‘శేఖర్’ ను గురించి చెప్పుకోవచ్చు. ‘గరుడవేగ’ సినిమాకి ముందు రాజశేఖర్ గారు చాలా మైనస్ లో ఉండటం వలన ఆ సినిమాను అనుకున్న స్థాయిలో బిజినెస్ చేసుకోలేకపోయాము.
ఆ సినిమా బాగా ఆడటం వలన లక్కీగా మేము కొంత రికవరీ చేసుకోగలిగాము. ‘ కల్కి’ దగ్గరికి వచ్చేసరికి ఒక లెవెల్ కి బిజినెస్ జరిగింది. ‘శేఖర్’ దగ్గరికి వచ్చేసరికి కోవిడ్ కారణంగా చాలా ఇబ్బందులు పడవలసి వచ్చింది. రాజశేఖర్ గారికి కోవిడ్ వచ్చి తగ్గిన తరువాతనే ‘శేఖర్ ‘ షూటింగ్ మొదలుపెట్టాము. సినిమాగా చూస్తే ఇది పెద్ద బడ్జెట్ పెట్టి చేయవలసిన సినిమా కాదు. కానీ కరోనా కారణంగా షూటింగుకి అంతరాయం కలగడం .. ఆలస్యం కావడం .. వడ్డీలు పెరగడం .. ఇలా బాగానే ఇబ్బందులు పడ్డాము.
పెద్ద సినిమాలు తీసేవారికి ఇబ్బందిలేదు .. అలాగే చిన్న సినిమాలు చేసేవారు కూడా ఒక జోన్ లో వెళ్లొచ్చు. మా సినిమా మధ్యతరగతి కుటుంబంలాంటిది. అందువలన దీనిని ముందుకు తీసుకుని వెళ్లడం కష్టమైంది. ఎన్నో కష్టాలను .. సమస్యలను దాటుకుని ఈ సినిమాను రిలీజ్ కి తీసుకుని వచ్చాము. ఈ సినిమాకి ముందుగా ఇద్దరు ముగ్గురు దర్శకులను అనుకున్నాము. కానీ కొన్ని కారణాల వలన వాళ్లతో ఈ ప్రాజెక్టు సెట్ కాలేదు. ఒక దర్శకుడిని తీసుకుంటే మేము అనుకున్నది ఆయనకి కనెక్ట్ కాలేదు.
ఒక సీనియర్ హీరోతో చేయడానికి చాలామంది యంగ్ డైరెక్టర్స్ కి కష్టమవుతోంది. సీనియర్ హీరోలు తమ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుంటారు. యంగ్ డైరెక్టర్స్ ఇప్పటి ట్రెండ్ ను దృష్టిలో పెట్టుకుంటున్నారు. అదీ .. ఇదీ మిక్స్ చేయడం వలన చాలామంది ఫెయిల్ అవుతున్నారు. లవ్ .. యాక్షన్ .. కామెడీలను హ్యాండిల్ చేయడం యంగ్ డైరెక్టర్స్ కి ఈజీనే. కానీ ఎమోషన్ దగ్గరికి వచ్చేసరికి ఇబ్బంది పడుతున్నారు. ‘శేఖర్’ ఎమోషనల్ సబ్జెక్ట్ .. అందువలన ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను నేను భుజాన వేసుకోవలసి వచ్చింది. ఈ జనరేషన్ కి తగినట్టుగానే సినిమా తీశానని అనుకుంటున్నాను” అని చెప్పుకొచ్చారు.