ఇప్పుడు సినిమా వైపు ప్రేక్షకులను మళ్లించే అత్యంత శక్తిమంతమైన సాధనంగా హీరోల లుక్స్ కి సంబంధించిన పోస్టర్స్ మారిపోయాయి. ఎన్నిమైళ్ల దూరమైనా ఒక్క అడుగుతోనే మొదలైనట్టుగా ఎన్నికోట్లతో రూపొందే సినిమా అయినా ఒక్క పోస్టర్ తోనే ముందుకు కదులుతోంది . అలాంటి పోస్టర్స్ విషయంలోనే ఇప్పుడు అంతా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పాత్రలను బట్టి నటీనటుల వేషధారణ ఉండటమనేది పాత కాలం నుంచి ఉన్నప్పటికీ ఇప్పుడు వాటిని ఆవిష్కరించే విధానం మారిపోయింది. నటీనటుల లుక్స్ విషయానికి ప్రాధాన్యతను ఇవ్వడమనేది ‘బాహుబలి’ నుంచి మరింత పుంజుకుందని చెప్పాలి.
‘బాహుబలి’ ప్రమోషన్స్ లో భాగంగా ఒక్కో పాత్ర లుక్ ను రివీల్ చేసిన తీరు ఆ సినిమాపై అంచనాలు పెంచుతూ వెళ్లిందనేది వాస్తవం. ఆ తరువాత కాలంలో అందరూ ఇదే పద్ధతిని అనుసరిస్తూ వెళుతున్నారు. టీజర్లు .. ట్రైలర్లు .. సింగిల్స్ రిలీజ్ చేస్తూనే మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు పోస్టర్లు వదులుతున్నారు. అలా ఒక సినిమా సెట్స్ పైకి వెళ్లిన దగ్గర నుంచి థియేటర్లకు వచ్చేంత వరకూ ఆ ప్రాజెక్టును ప్రేక్షకులకు టచ్ లో ఉంచుతున్నారు. ఎప్పటికప్పుడు వాళ్ల చూపుల నుంచి .. వాళ్ల చర్చల నుంచి తమ సినిమా పక్కకి వెళ్లకుండా చూసుకుంటున్నారు.
ఇక ఈ మధ్య కాలంలో పోస్టర్ల పరంగా అత్యంత ఆసక్తిని రేకెత్తించిన చిత్రంగా ‘ఆర్ ఆర్ ఆర్’ కనిపిస్తోంది. దాదాపు ఒకే ఇమేజ్ కలిగిన ఇద్దరు యంగ్ హీరోలతో ఒక మల్టీ స్టారర్ రావడమనేది ఈ సినిమాతోనే మొదలైందని చెప్పాలి. అంతటి స్టార్ డమ్ ఉన్న హీరోలను ఒప్పించడం .. అంతకాలం పాటు తన కూడా ఉండేలా చేసుకుని సినిమాను పూర్తి చేయడం రాజమౌళికి మాత్రమే చెల్లిందేమో. ఒక సినిమాకి సంబంధించిన విషయాలు లొకేషన్ నుంచి బయటికి వెళ్లకుండా చూడటం .. ఒక సినిమాకి పనిచేసేవారందరికీ ఐడీ కార్డులు ఉండేలా చూడటం కూడా ఇక్కడ ఆయనతోనే మొదలైంది.
‘ఆర్ ఆర్ ఆర్ ‘నుంచి ఒకసారి ఎన్టీఆర్ .. మరోసారి చరణ్ కి సంబంధించిన పోస్టర్లు వదులుతూ ఇటు నందమూరి అభిమానులను .. అటు మెగా ఫ్యాన్స్ ను ఖుషీ చేయడంలో ఆయన సక్సెస్ అయ్యారు. తాజాగా ఈ సినిమా నుంచి ఎన్టీఆర్ – చరణ్ కి సంబంధించిన కొత్త పోస్టర్స్ ను రిలీజ్ చేశారు. బుల్లెట్ ను జోరుగా నడుపుతూ ఎన్టీఆర్ .. డిఫరెంట్ కాస్ట్యూమ్స్ తో స్టైల్ గా నుంచున్న చరణ్ ఈ పోస్టర్స్ లో కనిపిస్తున్నారు. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జనవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ సినిమా సంచలనానికి అర్థం చెప్పడం ఖాయమనేది అభిమానుల మాట.