బిగ్ బాస్ మారుతున్నాడట!

తెలుగు మరియు తమిళంలో బుల్లి తెర సూపర్‌ హిట్ షో బిగ్ బాస్ నాలుగు ఏళ్ల క్రితం ప్రారంభం అయ్యింది. ఇప్పటికే నాలుగు సీజన్ లు పూర్తి చేసుకుని ఈ ఏడాది అయిదవ సీజన్ ను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నాలుగు సీజన్ లకు తెలుగులో ముగ్గురు హోస్ట్‌ లు మారారు. కాని తమిళంలో మాత్రం ఒకే ఒక్క హోస్ట్‌ ఉన్నాడు. అతడే కమల్‌ హాసన్ అనే విషయం తెల్సిందే. వరుసగా నాలుగు సీజన్ లకు కూడా హోస్టింగ్‌ చేశాడు. తమిళ బిగ్‌ బాస్ సీజన్‌ 5 కి మాత్రం ఆయన హోస్టింగ్‌ చేయడం లేదని మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

బిగ్‌ బాస్‌ నిర్వహణ ఇబ్బందిగా ఉన్నా కూడా ఆర్థిక అవసరాల కోసం చేస్తున్నట్లుగా గతంలో చెప్పుకొచ్చాడు. ఎక్కువ సమయం నిలబడలేక ఇటీవల షో లో కుర్చీలో కూర్చుని మరీ కమల్‌ హోస్టింగ్‌ చేశాడు. ఇక ఈ ఏడాది షో కు ఆయన అనేక కారణాల వల్ల దూరంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం అందుతోంది. తమిళ బిగ్‌ బాస్‌ సీజన్ 5 కోసం హీరో శింబుతో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. కమల్‌ స్థానంలో శింబు దాదాపుగా ఖరారు అయ్యాడు అంటున్నారు. మరి శింబు ఏ మేరకు బిగ్ బాస్ ను నడిపిస్తాడు అనేది చూడాలి.