కరణం వ్యాఖ్యల మర్మమేంటి?

ఏపీలో అధికార పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ పని చేయడంలేదా? వైసీపీలోకి జంప్ చేద్దామని భావించిన టీడీపీ ఎమ్మెల్యేలు ఆ దిశగా ముందుకు వెళ్లకపోవడానికి కారణాలేంటి? ఇందుకు అధికార పార్టీలో వెలుగుచూస్తున్న లుకలుకలే కారణమా లేక టీడీపీ అధినేత చంద్రబాబు చాణక్యం పనిచేసిందా? ప్రస్తుతం ఈ అంశం జోరుగా చర్చనీయాంశమైంది. టీడీపీ మహానాడు కంటే ముందుగానే కనీసం ఐదుగురు ఎమ్మెల్యేలను టీడీపీ నుంచి బయటకు తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు సాగాయి. ఈ క్రమంలో ఆరుగురు ఎమ్మెల్యేలు అధికార పార్టీ పెద్దలతో సమాలోచనలు సాగించారనే ప్రచారం సాగింది.

అయితే, చర్చల్లో ఏం జరిగిందో తెలియదుగానీ టీడీపీని ఏ ఎమ్మెల్యే కూడా వీడలేదు. పైగా టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తనపై వస్తున్న వదంతులను ఖండించారు. తాను పార్టీ వీడేది లేదని స్పష్టంచేశారు. అలాగే ఇద్దరు ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు కూడా వైసీపీకి జైకొడతారనే ప్రచారం జరిగినా.. అలాంటిది ఏమీ జరగలేదు. వారందరితో పార్టీ అధినేత చంద్రబాబు మాట్లాడారని, అందుకే ఎవరూ పార్టీ వీడాలని అనుకోలేదని టీడీపీలోని కొన్ని వర్గాలు చెబుతుండగా.. అధికార పార్టీలో లుకలుకలు పెరుగుతున్నందున ఇప్పుడు ఆ పార్టీలోకి వెళ్తే ఒరిగేది ఏమీ ఉండదనే కారణంతోనే వీరంతా ప్రస్తుతానికి ఆగిపోయారని మరో వాదన వినిపిస్తోంది.

ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే కరణం బలరాం వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. టీడీపీని వీడి వైసీపీకి జైకొట్టిన బలరాం సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుపై టీడీపీ ఎమ్మెల్యేలకు నమ్మకం పోయిందని, వారంతా సీఎం జగన్ చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు జగన్ కు జైకొడతారో చెప్పలేమని వ్యాఖ్యానించారు.

అయితే, ఇదంతా వైసీపీ మైండ్ గేమ్ అని టీడీపీ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. వైసీపీలోనే అసంతృప్తి రాజుకుందని, ఈ నేపథ్యంలో తమ పార్టీ నేతలెవరూ ఆ పార్టీకి వెళ్లబోరని అంటున్నారు. ఈ పరిణామాలన్నింటి నుంచి జనాల దృష్టి మరల్చడంతోపాటు టీడీపీ ఎమ్మెల్యేల్లో గందరగోళం సృష్టించేందుకే కరణం అలా మాట్లాడి ఉండొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.