అల్లు అర్జున్ కెరీర్లోనే భారీ విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం ‘అల వైకుంఠపురములో’ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుని బాహుబలి సిరీస్ తరువాత టాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి వసూళ్ళ పరంగా రికార్డులను తిరగరాసింది.
ఈ నేపధ్యంలో ఈ చిత్ర రీమేక్ హక్కులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇతర భాషా చిత్రాల నిర్మాతలు రీమేక్ హక్కుల కోసం పోటీపడ్డారు. హిందీ రీమేక్ లో అల్లు అర్జున్ ‘బంటు’ పాత్రలో నటించాలని షాహిద్ కపూర్, అక్షయ్ కుమార్ లాంటి వారు ఆసక్తి చూపిస్తున్నట్లుగా వార్తలు కూడా వచ్చాయి. తాజాగా యువ కధానాయకుడు కార్తీక్ ఆర్యన్ హిందీ రీమేక్ లో నటించాలని ఉవ్విళ్ళూరుతున్నాడు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “నెట్ ఫ్లిక్స్ లో అల వైకుంఠపురములో చిత్రాన్ని చూసాను. చాలా సరదాగా అనిపించింది. అల్లు అర్జున్ సినిమాలో అధ్బుతంగా నటించాడు. నేను రీమేక్ లో భాగం అవుతానా, లేదో తెలియదు కానీ అల్లు అర్జున్ పాత్రలో నన్ను తప్ప వేరొకరిని ఊహించుకోలేను. లాక్ డౌన్ కు ముందు ఈ సినిమా రీమేక్ లో నటించటానికి నాకు ఆఫర్ వచ్చింది కానీ ఇపుడున్న పరిస్థితుల్లో వేచి చూడటం తప్ప ఇంకేమీ చేయలేను” అని చెప్పుకొచ్చాడు.
నెమ్మదిగా బాలీవుడ్లో తనకంటూ ఒక ముద్ర వేసుకుంటున్న కార్తీక్ ఆర్యన్ ఇటీవలి కాలంలో ‘లవ్ ఆజ్ కల్’, ‘పతీ పత్నీ ఔర్ ఓ’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మరి బాలీవుడ్ ‘బంటు’గా కనిపించాలని ఆశపడుతున్న ఈ యువ కథానాయకుడి కలలు ఎంతవరకూ నెరవేరతాయో, అంతా కరోనా చేతుల్లో ఉంది. కరోనా…కుచ్ కరోనా.!