బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్ 708 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుని.. 709 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్ హైలైట్స్ మీకోసం. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న‘కార్తీకదీపం’ సీరియల్ నేటి (జనవరి 20) రాత్రి ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ‘సమయం’లో మీకోసం ముందుగానే.
గత ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే…
హిమ విడాకుల విషయం మరిచిపోయేలా చెయ్యాలని.. కార్తీక్ హిమని రెస్టారెంట్‌కి తీసుకుని వెళ్తాడు. అయితే హిమా మాత్రం అదే విషయం ఆలోచిస్తూ ఉంటుంది. ‘డాడీ ఎందుకు అబద్దం చెబుతున్నారు? డాడీ విడాకులు ఇచ్చేది ఎవరికి? అమ్మ బతికే ఉంది.. డాడీతో ఎలాగైనా నిజం చెప్పించాలి..’ అనుకుంటుంది మనసులో.. ‘హిమకి ఎలా నిజం చెప్పాలి? ఆ వంటలక్కకి విడాకులు ఇస్తున్నానని ఎలా చెప్పాలి? అనాథని(హిమని) తెచ్చి పెంచుకున్నామని ఎలా చెప్పాలి? హిమ ఈ టాపిక్ మరిచిపోయేలా చెయ్యాలి..’ అని అనుకుంటాడు కార్తీక్ మనసులో..
అమ్మ పేరు దీపే కదా?
‘అమ్మ పేరు దీప కదా డాడీ’ అంటుంది హిమ. ‘కానీ మీ అమ్మ లేదు’ అంటాడు కార్తీక్ కూల్‌గా.. ‘ఉంది. ఉంది కాబట్టే నువ్వు విడాకులు తీసుకుంటున్నావ్. నువ్వు మంచోడివా డాడీ? కానీ అబద్దం చెబుతున్నావ్.. అమ్మ పేరు దీపే కదా? ఆ రోజు పాస్‌ఫోర్ట్ అప్లికేషన్‌లో నువ్వు రాశావ్ నేను చూశాను..’ అంటూ అరుస్తుంది హిమ. కార్తీక్ చుట్టూ గమనిస్తూ చుట్టూ కూల్ చెయ్యడానికి ప్రయత్నిస్తాడు.
కార్తీక్ అసహనం..
స్పూన్ విసిరి కొడుతూ.. ‘నాకు అమ్మ కావాలి డాడీ.. అమ్మ ఎక్కడుందో చెప్పు.. ఎందుకు దూరంగా ఉందో చెప్పు.. అసలు నువ్వు ఎందుకు విడాకులు ఇస్తున్నావ్. నాకెందుకు అబద్దం చెప్పావ్?’ అంటూ అరుస్తుంది. చుట్టూ జనమంతా వాళ్లనే గమనిస్తూ ఉంటారు. దాంతో కార్తీక్.. ‘హిమా..’ అని గట్టిగా అరుస్తాడు. కానీ హిమ పట్టించుకోదు. ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూనే ఉంటుంది.
సారీ డాడీ..
హిమ ఏ మాత్రం ఆగకపోయేసరికి.. కార్తీక్ డబ్బులు(ఫుడ్ ఆర్డర్ పెట్టినందుకు) అక్కడ పెట్టేసి.. ‘పద వెళ్దాం.. అందరూ మనల్నే చూస్తున్నారు’ అనడంతో హిమ బాధగా ముఖం పెట్టి.. ‘అయ్యో సారీ డాడీ’ అంటుంది. ‘పద వెళ్దాం ఇప్పుడు నేను నిన్నేం అనలేదు కదమ్మా’ అంటూ బుజ్జగిస్తూ ‘అయ్యో మళ్లీ జ్వరం వచ్చినట్లుంది’ అంటూ హిమని ఎత్తుకుని ఇంటికి బయలుదేరతాడు కార్తీక్.
దీప అనుమానం..
సౌందర్య, దీపలు కారులో వెళ్తూ ఉంటారు. స్కూల్‌లో సౌర్య రచ్చ చేసిన తర్వాత దీపని ఇంట్లో దింపడానికి సౌందర్య దీపని తీసుకుని బయలుదేరుతుంది. ‘మీ అబ్బాయి.. ఆ మౌనిత కలిసి కారులో నవ్వుకుంటూ పోతున్నారట అత్తయ్యా.. మౌనితని చేసుకోవడానికే దీపకి విడాకులు ఇస్తున్నాడేమో మీ అబ్బాయి. విడాకుల డేట్ దగ్గర పడే కొద్ది నాకు టెన్షన్ ఎక్కువ అయిపోతుంది అత్తయ్యా’ అంటూ అనుమానం వ్యక్తం చేస్తుంది దీప.
సౌందర్య సముదాయింపు..
‘దీపా పిచ్చి ఆలోచనలు చెయ్యకే.. ఖాళీగా ఉంటే.. మీ నాన్న కొనిచ్చిన స్మార్ట్ ఫోన్‌లో హనుమానుచాలీసా విను మనసు తేలిక పడుతుంది. అంతే కానీ నీ ఆలోచనలు పంచుకోవడానికి తోడుగా లేనప్పుడు ఆలోచించడం మానెయ్యి’ అని తిడుతూనే.. ‘నీకు వచ్చిన ఆలోచన కరెక్ట్ కాదే. మౌనిత ఎన్ని ఎత్తులు వేసినా? వాడు ఎంత అమాయకంగా మౌనితని నమ్మినా.. మౌనితని పెళ్లి చేసుకునే ఉద్దేశం వాడికి లేదు. మీకు విడాకులు రావు’ అంటుంది సౌందర్య నమ్మకంగా..
ఛాన్స్ ఉండదు కదమ్మా?
మౌనితతో ప్రియమణీ.. ‘అమ్మా.. ఆ కార్తీక్ అయ్యకు హిమ అంటే చాలా ఇష్టం కదా? విడాకులు తీసుకోవద్దు డాడీ.. అని ఏడిస్తే.. కార్తీక్ అయ్య లైప్‌లో.. రెండో పెళ్లికి ఛాన్స్ ఉండదు కదమ్మా’ అంటూ అనుమానం వ్యక్తం చేస్తుంది. వెంటనే మౌనిత ఆలోచనలో పడుతుంది. ‘హిమకి వాళ్ల అమ్మే దీప అని, దీపకే విడాకులు ఇస్తున్నాడనే విషయం తెలియకుండా జాగ్రత్త పడాలి.. ఒకవేళ నిజం బయటపడి.. హిమ కార్తీక్‌ని పట్టుపడితే ఇక నా జీవితం నాశనం అయిపోతుంది’ అంటూ కంగారు పడుతుంది.
నీకు దన్నం పెడతాను
‘అమ్మా ఒకటి అడగనా?’ అంటుంది సౌర్య దీపతో.. ‘మళ్లీ ఒకటా? నీకు దన్నం పెడతాను తల్లీ’ అంటుంది దీప టెన్షన్‌గా.. ‘అబ్బా నువ్వు చెప్పేదాని గురించే అడుగుతానులే కంగారు పడకు’ అని సౌర్య అనడంతో.. ‘చెప్పేదైతే చెబుతాను.. అడుగు’ అంటుంది దీప. ‘నువ్వు పెళ్లికి ముందు లంగాఓణీలు వేసుకునేదానివా?’ అని అడుగుతుంది సౌర్య. ‘ఎక్కువగా లంగాఓణీలే వేసుకునేదాన్ని.. అయినా నాకెన్ని ఉండేవి.. ఒకటి వంటి మీద ఉంటే.. మరొకటి దండెం మీద ఉండేది. ఒకసారి మాత్రం మా నాన్న చుడీదర్ తీసుకొచ్చారు’ అంటూ గతంలోకి వెళ్లిపోతుంది దీప.
ఆత్మసౌందర్యం..?
చుడీదర్ వేసుకున్నప్పుడు రోడ్డు మలుపులో యాక్సిడెంట్లు కాకుండా దీప తన చున్నీని అడ్డుపెట్టి ప్రయాణికులకు హెచ్చరికగా పెట్టడం కార్తీక్ చూడటం, కార్తీక్ పెళ్లి చేసుకుంటానని చెప్పడం.. ‘మా అమ్మలా నేను అందం చూడను. ఆత్మ సౌందర్యం చూస్తాను కాబట్టి..’ అంటూ కార్తీక్ చెప్పిన మాటలను తలుచుకుంటూ.. అప్పుడు తను నవ్విన నవ్వు తలుచుకుంటూ పెద్దగా నవ్వుతుంది. ‘ఆత్మసౌందర్యం.. నా ముఖానికి ఆత్మసౌందర్యం.. ఆ మనిషికి ఉందా ఆత్మ సౌందర్యం…?’ అంటూ నవ్వుతూనే ఏడుస్తుంది. పక్కనే ఉన్న సౌర్య ‘ఏమైంది’ అని అడగడంతో దీప వాస్తవానికి వచ్చి కళ్లు తుడుచుకుంటుంది. ఆ సీన్ ప్రేక్షకుల గుండెలను మెలిపెట్టక మానదు.
ఎక్కడికి తీసుకెళ్లావ్?
‘ఇవాళ హిమని ఎక్కడికి తీసుకుని వెళ్లాడో తేలుస్తానండీ..’ అంటుంది సౌందర్య ఆవేశంగా.. ‘మౌనితతో పాటూ తీసుకుని వెళ్లానంటాడు అప్పుడు మన పెద్దరికం నిలబడుతుందా?’ అంటాడు ఆనందరావు. ఇంతలో హిమని ఎత్తుకుని కార్తీక్ రావడం చూసి.. ‘ఏమైంది హిమకు’ అని అడుగుతుంది సౌందర్య టెన్షన్‌గా.. ‘నా కర్మైంది..’ అంటాడు కార్తీక్ కోపంగా.. ‘ఎక్కడికి తీసుకెళ్లావ్?’ అంటుంది సౌందర్య. ‘కడుపు నిండా అన్నం తినిపించడానికి తీసుకెళ్లాను’ అంటాడు కార్తీక్ సమాధానంగా..
మళ్లీ వంటలక్క గురించి..
ఇంతలో హిమ తల మీద చెయ్య వేసిన ఆనందరావు.. ‘మళ్లీ జ్వరమా?’ అంటాడు కంగారుగా.. ‘దిగులు..’ అంటాడు కార్తీక్. ‘ఏంటమ్మా నా వడిలో పడుకుంటావా? రా..’ అంటూ హిమని ఒడిలో పడుకోబెట్టుకున్న సౌందర్య.. ‘ఏమైందే? చెప్పమ్మా.. ఏమైంది?’ అంటూ ఆరా తియ్యడంతో ‘మళ్లీ వంటలక్క గురించి మొదలుపెడతారేమోనని’ కార్తీక్ కంగారు పడతాడు. ‘ఎందుకు పిలుస్తావ్ మమ్మీ? వదిలెయ్ మీతో గొడవ పడే ఓపిక నాకు లేదు..’ అంటూ హిమని భుజాన్న వేసుకుని పైకి తీసుకుని వెళ్లిపోతాడు కార్తీక్. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! కార్తీకదీపం కొనసాగుతోంది.