Karthika Deepam Serial 5th February Episode Online

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్ 722 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుని.. 723 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్‌ హైలైట్స్ మీకోసం. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న‘కార్తీకదీపం’ సీరియల్ నేటి (ఫ్రిబవరి 5) రాత్రి ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ‘సమయం’లో మీకోసం ముందుగానే.

గత ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే…

శ్రావ్య, దీప, మురళీ కృష్ణ..లు ఒక చోట మాట్లాడుకుంటే హిమ వినేస్తుంది. దాంతో దీప శ్రావ్య అక్క అని, మురళీ కృష్ణ.. పెద్ద కూతురనే నిజం తెలిసిపోతుంది. దాంతో హిమ ఓ పక్కకు వెళ్లి సంబరపడిపోతూ.. ‘అంటే వంటలక్క నాకు పెద్దమ్మా.. అంతుందా? ఇక్కడ నుంచి వంటలక్కని పెద్దమ్మా అని పిలుస్తాను’ అనుకుంటూ దీప దగ్గరకు బయలుదేరుతుంది. అయితే భాగ్యం దీపని అవమానించడంతో.. సౌందర్య ‘ఏం అన్నావ్ నా కోడల్ని’ అంటూ తిడుతున్న సమయంలో హిమ రావడం చూసిన మురళీ కృష్ణ.. హిమని ‘మీ శ్రావ్య పిన్ని పిలుస్తోంది’ అంటూ ఆ గొడవ వినిపించకుండా శ్రావ్య దగ్గరకు తీసుకుని వెళ్లిపోతాడు. దాంతో హిమ తన డౌట్స్ అన్ని వాళ్లనే అడగడం మొదలుపెడుతుంది.

ప్రశ్నల మీద ప్రశ్నలు..

‘మీరంతా ఎప్పుడూ నిజాలే చెప్పరు.. వంటలక్క నీకు సొంత అక్కే కదా? ఎందుకు చెప్పలేదు? అంటే.. సౌర్య వాళ్ల నాన్న గురించి కూడా మీకు తెలుసే ఉండాలిగా? మరి మీరు ఎప్పుడు సౌర్య వాళ్ల నాన్న గురించి చెప్పలేదెందుకు? సౌర్య వాళ్ల నాన్న ఎందుకు మాట్లాడరు? అతను ఎప్పటికీ రాడా? వంటలక్క ఒక్కర్తే ఉండాలా? ఎందుకు మీరంతా ఉండగా వేరే ఉండాలి..? తను ఎందుకు అన్ని కష్టాలు పడాలి?’అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూనే ఉంటుంది.

మురళీ కృష్ణ ఆవేదన..

ఆ మాటలకు అటు శ్రావ్య.. ఇటు మురళీ కృష్ణ షాక్ అవుతారు. వెంటనే మురళీ కృష్ణ తేరుకుని.. ‘ఎందుకని నువ్వు మమ్మల్ని అడుగుతున్నావ్.. మేమంతా దేవుడ్ని అడుగుతున్నాం. దానికి ఎందుకు ఈ కష్టాలు అని.. దేవుడిలాంటి మనిషి(కార్తీక్)ని అడగలేక.. దేవుడ్ని ప్రశ్నించలేక ఇలాగే మౌనంగా ఉండిపోయాం అంతే’ అంటూ ఏడుస్తూ అక్కడ నుంచి వెళ్లిపోతాడు.

శ్రావ్య కవరింగ్..

‘తాతయ్యా ఏం చెప్పారో నాకేం అర్థం కాలేదు. కానీ ఎందుకు ఏడుస్తున్నారు పిన్నీ?’ అంటూ శ్రావ్యని అడుగుతుంది హిమ.
‘అదేం లేదు హిమా.. వంటలక్క మా అక్క అని నీకు తెలుసని మేమంతా అనుకుంటున్నాం.. అంతే. నీకు ఇప్పుడే తెలిసిందని.. మాకూ ఇప్పుడే తెలిసింది’ అంటూ కవర్ చేస్తుంది శ్రావ్య. సౌందర్య భాగ్యానికి ఎదురు పడుతుంది. ‘నా కోడలు ఎక్కడా?’ అంటుంది సౌందర్య. ‘పెద్దకోడలా చిన్న కోడలా? వదినగారూ?’ అంటుంది భాగ్యం.

నచ్చావ్ పో..

వెంటనే సౌందర్య నవ్వుతూ.. ‘నచ్చావ్ పో.. అక్షింతలు పడితే కానీ నువ్వు దారిలోకి రావుగా?’ అంటుంది. వెంటనే పక్కనే ఉన్న ఆనందరావు.. ‘అవును అక్షింతలంటే నాలుగు చాలవు. కనీసం అద్దపావు ఉండాలి’ అంటాడు. భాగ్యం తింగర తింగరగా నవ్వుతూనే.. ‘పెద్దకోడలు తెలియదు కానీ వదినా.. ఇదిగో ఎదురుగానే ఉంది మీ చిన్న కోడలు’ అంటుంది. పక్కనే హిమని చూసి షాక్ అవుతుంది సౌందర్య.

భాగ్యం హైరానా..

వెంటనే భాగ్యం వైపు కోపంగా చూస్తూ… ‘నీకు బుద్ది ఉందా? పెద్ద కోడలు అనే మాట విదంటే.. ఎవరా పెద్ద కోడలు అని పడుతుంది ఆ పొట్టి బుడంకాయ్’ అంటుంది టెన్షన్‌తో మెల్లగా భాగ్యానికి మాత్రమే వినిపించేలా.. అయితే భాగ్యం గట్టిగా.. ‘పొట్టి బుడంకాయ్ ఏం వినలేదు లెండీ..’ అనగానే హిమ తల తిప్పి అటుగా చూస్తుంది. వెంటనే భాగ్యం హిమతో.. ‘నిన్ను కాదులెమ్మా’ అనగానే.. ‘పొట్టి బుడంకాయ్ అంటే నేనే…’ అంటుంది హిమ. ఆ సీన్ భలే కామెడీగా ఉంటుంది.

సౌందర్య కవరింగ్..

వెంటనే సౌందర్య.. ‘హిమా తమ్ముడు ఏం చేస్తున్నాడు?’ అంటూ మాట మార్చేస్తుంది. అంతా హ్యాపీ బాబుకి బంగారు గొలుపులు పెడుతుంటే.. దీప తను తీసుకొచ్చిన రవిక ముక్క పెట్టడానికి ఇబ్బంది పడుతుంది. అయితే శ్రావ్య, మురళీ కృష్ణలు అది గమనిస్తారు. వెంటనే శ్రావ్య.. ప్రేమగా దాన్ని తీసుకుని ‘ప్రేమగా తీసుకొచ్చి ఈ రవిక ముక్క చాలక్కా’ అంటుంది.

అంతా హ్యాపీ..

అదంతా చూసిన హిమ మనసులో.. ‘పాపం వంటలక్క చాలా పూర్.. సౌర్య వాళ్ల నాన్న ఉండి ఉంటే ఈ కష్టాలు ఉండేవి కాదు’ అనుకుంటూ.. ‘వంటలక్కా.. నువ్వు నాకు’ అని మొదలుపెడతుంటే మురళీ కృష్ణ.. ‘రా హిమా..’ అంటూ ఏదో కబుర్లు చెబుతూ అక్కడ నుంచి తీసుకుని వెళ్లిపోతాడు. మౌనిత బాధగా ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇంతలో ప్రియమణి రావడంతో తన టెన్షన్ అంతా వెల్లగక్కుతుంది.

మా ఆయన చాలా అమాయకుడు..

‘అంతా కలిసిపోయారు ప్రియమణీ.. అంతా కలిసి పోయారు.. ఇక మా ఆయన(నా సంతృప్తి కోసం అంటున్నాను అని చెబుతూనే..) మా ఆయన చాలా అమాయకుడు. మరదల మాట తీసెయ్యలేడు. తల్లి మాట తోసెయ్యలేడు, కూతురు మాట కాదనలేడు.. అంతా కలిసిపోతారు’ అంటూ తన బాధని చెప్పుకుంటుంది.

ఎక్కడికి వెళ్లావ్?

సౌర్య ఇంటికి వచ్చేసరికి దీప కంగారుగా.. ‘చీర మార్చుకోవాలి.. లేదంటే దొరికేస్తాను’ అనుకుంటుంది. అయితే సౌర్య వచ్చేస్తుంది. ‘దొరికేశాను’ అనుకుంటూ.. ఉండగా.. ‘ఎక్కడికి వెళ్లావ్? కచ్చితంగా ఆ ఇంటికే వెళ్లి ఉంటావ్..? హాస్పిటల్‌కి వెళ్లావా? మందులు చిట్టూ చూపించు.. ఆ ఇంటికి ఎందుకు వెళ్లావ్? వంటల చెయ్యడానికి రమ్మన్నారా? వడ్డించడానికి రమ్మన్నారా?’ అంటూ రాద్దాంతం చేస్తుంది.
రావే పోవే అనేశాను..

దీప విన్నంత సేపు వింటుంది. సౌర్య మాటలు సృతిమించడంతో.. ‘ఆపుతావా? వేలుడంత లేవు? ఏంటే నోటికి వచ్చింది మాట్లాడుతున్నావ్? ఏం అనుకుంటున్నావే? ఒక్కటిచ్చానంటే.. రెండో మాట మాట్లాడవ్..’ అంటూ తిట్టి ‘వెళ్లి కాళ్లు చేతులు కడుక్కుని రా.. బయటికి వెళ్దాం.. శ్రావ్య పిన్ని వాళ్ల బాబుకి స్వెటర్ కొందాం’ అంటూ తోస్తుంది. భయంతో సౌర్య వెనక్కి వెనక్కి తిరుగుతూ.. బాత్ రూమ్‌లోకి వెళ్లగానే.. ‘సారీ అత్తమ్మా.. సారీ కోపంతో రావే పోవే అనేశాను…’ అంటూ లెంపలు వేసుకుంటుంది.

పాపం వంటలక్క..

బాత్ రూమ్‌లోకి వెళ్లకుండా తిరిగి వెనక్కి వచ్చి చూస్తుంది సౌర్య. వెంటనే దీప మళ్లీ కోపంగా ముఖం పెట్టి.. ‘ఏంటీ అలా చూస్తున్నావ్.. ఎమెల్యే వెనక నిలబడిన గన్ మెన్‌లాగా? వెళ్లు’ అని అరవడం భలే నవ్వు తెప్పిస్తుంది. హిమ హాల్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. ‘పాపం వంటలక్క.. తను చాలా కష్టాలు పడుతోంది. తను మాకు చుట్టాలేనన్న విషయం తెలియనే తెలియదు నాకు.. ఇక నుంచి వంటలక్కకు కష్టాలు ఉండకూడదు. వంటలక్కకి డాడీకి పెళ్లి చెయ్యాలి’ అనుకుంటుంది.

కాసేపు ఆగి వెళ్దాం..

ఇంతలో కార్తీక్ వచ్చి పక్కనే కూర్చుంటాడు. వంటలక్క అని మొదలుపెడతుంది హిమ. కార్తీక్ ‘ఆపమ్మా’ అనడంతో హిమ మాట మార్చి.. ‘డాడీ తమ్ముడికి స్వెటర్ కొందాం డాడీ’ అనడంతో ‘కాసేపు ఆగి వెళ్దాం’ అంటాడు. మొత్తానికీ దీప, కార్తీక్‌లు స్వెటర్స్ కొనడానికి ఒకే చోట ఒక చోట కలవనున్నారు. హిమకు నిజం తెలియడంతో కథ ఆసక్తిగా మారింది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం. కార్తీకదీపం కొనసాగుతోంది.