కాటమ’బాదుడు’ మరీ టూమచ్‌

కాటమరాయుడు ఓవర్సీస్‌ రైట్స్‌ని సినీ గెలాక్సీ అనే సంస్థ పన్నెండు కోట్ల రూపాయలు చెల్లించి సొంతం చేసుకుంది. అచ్చమైన పల్లెటూరి చిత్రం, మాస్‌కి మాత్రమే టార్గెట్‌ చేసిన మూస చిత్రం కావడంతో పన్నెండు కోట్ల పెట్టుబడి టూమచ్‌ అని ఓవర్సీస్‌ ట్రేడ్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

సినిమాకి హిట్‌ టాక్‌ వస్తే బ్రేక్‌ ఈవెన్‌ అవడానికి ఛాన్స్‌ వుంటుంది కానీ లాభాలు తెచ్చిపెట్టే డీల్‌ కాదని, ఒకవేళ ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’లా నిరాశ పరిస్తే కనుక భారీ స్థాయిలో నష్టం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘ఖైదీ నంబర్‌ 150’ చిత్రానికి వచ్చిన ఓపెనింగ్‌ చూసి, కాటమరాయుడు టీజర్‌ చూసి దీనిపై ఇంత పెట్టుబడి పెట్టారనేది అర్థమవుతోంది. కానీ చిరంజీవి పదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన చిత్రం కావడంతో ఓపెనింగ్‌ ఆ స్థాయిలో వచ్చిందనేది మర్చిపోకూడదు.

తొలి రోజే మిలియన్‌కి పైగా వసూలు చేసిన ఖైదీ ఫుల్‌ రన్‌లో మొదటి రోజు చేసిన బిజినెస్‌కి సరిగ్గా రెట్టింపు వసూలు చేసింది. అంటే మొదటి రోజు ప్రభావం ఏ స్థాయిలో వుందనేది అర్థం చేసుకోవచ్చు. ‘కాటమరాయుడు’పై జనాల్లో అంత క్రేజ్‌ వుంటుందా? చిరంజీవి సినిమా కోసం వచ్చినట్టుగా పవన్‌ కోసం బారులు తీరిపోతారా? ఒక సగటు మాస్‌ సినిమా అయిన ‘కాటమరాయుడు’ మెప్పించలేకపోతే పన్నెండు కోట్ల డీల్‌కి ఏమైనా న్యాయం జరుగుతుందా? ఓవర్సీస్‌ బిజినెస్‌ ఎంత లాజిక్‌లెస్‌గా జరుగుతుందనే దానికి కాటమరాయుడు తాజా ఉదాహరణ.