కవితమ్మా.. మరీ ఇంత కామెడీ అవసరమా.?

రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఆ విషయం టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కుమార్తెకి కూడా బాగానే తెలుసు. టీఆర్‌ఎస్‌ నుంచి ఓ సారి ఎంపీగా గెలిచిన కవిత, ఆ తర్వాత ఓటమి చవిచూశారు. మళ్ళీ గెలుస్తారో లేదో తెలియని అయోమయం నేపథ్యంలో శాసన మండలి దారి చూసుకున్నారామె. ఇటీవల ఆమె శాసన మండలికి ఎంపికైన విషయం విదితమే.

లోక్‌సభ బరిలో ఆమెను ఓడించింది భారతీయ జనతా పార్టీనే. అలాంటి భారతీయ జనతా పార్టీ మీద కవిత కామెడీలు చేస్తున్నారు గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికల ప్రచారంలో. ‘కొన్నాళ్ళ క్రితం బండ్ల గణేష్‌ కామెడీ చేశాడు.. ఇప్పుడు బండి సంజయ్‌ కామెడీ చేస్తున్నాడు..’ అంటూ వెటకారం చేసేశారు కవిత.

ఏమో, రాజకీయాల్లో ఎప్పుడు ఈక్వేషన్స్‌ ఎలా మారిపోతాయో చెప్పలేం. దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా టీఆర్‌ఎస్‌ ఎగిరెగిరి పడింది. కానీ, అక్కడ రిజల్ట్‌ ఏమయ్యింది.? బీజేపీ, టీఆర్‌ఎస్‌ని ఓడించేసింది. నిజామాబాద్‌లో కవితను దెబ్బకొట్టిన బీజేపీ, దుబ్బాకలో హరీష్‌రావుని దెబ్బతీసింది. దుబ్బాక ఉప ఎన్నికలో తన పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు హరీష్‌రావు ఎంతలా కష్టపడ్డారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, హరీష్‌ మీద వున్న గౌరవం కంటే, టీఆర్‌ఎస్‌ మీద వ్యతిరేకతే ఓటర్లలో అక్కడ చాలా ఎక్కువగా కనిపించింది.

బండ్ల గణేష్‌ విషయానికొస్తే, ఆయనేమీ సీరియస్‌ పొలిటీషియన్‌ కాదు. కాంగ్రెస్‌ నుంచి పోటీ చేద్దామనుకున్నారు.. కాలం కలిసిరాలేదు. బండి సంజయ్‌ అలా కాదు.. ఆయనిప్పుడు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు. బండి సంజయ్‌ చేస్తోన్న సంచలన వ్యాఖ్యల కారణంగానే గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీకి విపరీతమైన ఊపు వచ్చిందన్నది నిర్వివాదాంశం. బండి సంజయ్‌ విసిరిన సవాల్‌కి సమాధానం చెప్పలేక అధికార టీఆర్‌ఎస్‌ అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తోంది.

సరే, బీజేపీ.. గ్రేటర్‌ ఎన్నికల్లో గెలుస్తుందా.? లేదా.? అన్నది వేరే చర్చ. టీఆర్‌ఎస్‌ తనకి వున్న ఎక్స్‌ అఫీషియో ఓట్ల బలం, మిత్రపక్షం మజ్లిస్‌తో కలిసి మేయర్‌గిరీని గెల్చుకునే అవకాశాలున్నాసరే.. బీజేపీ, కసిగా పోరాడుతోందంటే.. దీన్ని కామెడీ చేయడం ద్వారా కవిత, తన స్థాయిని తగ్గించేసుకున్నారన్నది నిర్వివాదాంశం.