దేశంలో ఉత్తమ ముఖ్యమంత్రులు ఎవరు అనే అంశంపై తాజాగా ఓ సర్వే వచ్చింది. వివిధ అంశాలపై స్టేట్ ఆఫ్ ది నేషన్ 2020 పేరుతో ఐఏఎన్ఎస్-సీ ఓటర్ దీనిని నిర్వహించింది. ఇందులో ఉత్తమ ముఖ్యమంత్రుల్లో మొదటి స్థానంలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నిలవగా.. ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ బాగెల్, కేరళ సీఎం పినరయి విజయన్ రెండు మూడు స్థానాల్లో నిలిచారు. ఏపీ సీఎం జగన్ నాలుగో స్థానంలో నిలవగా.. తెలంగాణ సీఎం కేసీఆర్ 16వ స్థానంలో ఉండటం ఆశ్చర్యం కలిగించింది. మొన్న మొన్నే పాలనా పగ్గాలు చేపట్టిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఐదో స్థానంలో నిలవడం గమనార్హం.
నిజానికి కరోనా వచ్చిన తర్వాత ప్రధాని మోదీ సందేశాల తర్వాత సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్లకే రికార్డు స్థాయిలో వ్యూయర్ షిప్ లభించింది. ఆయన ప్రెస్ మీట్ చూడటానికి జనాలు చాలా ఉత్కంఠగా ఎదురు చూసేవారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే విషయంలో కేసీఆర్ చిత్తశుద్ధి లేకుండా పనిచేస్తున్నారు. అలాంటి సీఎం 16వ స్థానంలో ఉండటం ఏమిటనే అంశంపై ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతోంది.
ఈ సర్వే ఆయన పనితీరుకు ప్రామాణికం కాకపోయినప్పటికీ, మరీ అంత వెనకబడానికి కారణాలు ఏమిటా అని పలువురు ఆరా తీస్తున్నారు. సర్వేలో భాగంగా ప్రతి రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం నుంచి 3వేల మంది నుంచి అభిప్రాయాలను సేకరించారు. దాదాపు నాలుగు కోట్ల మంది ఉన్న తెలంగాణలో 3వేల మంది అభిప్రాయాలు మొత్తం రాష్ట్రమంతా ప్రతిఫలిస్తుందని చెప్పలేం.
ఏదైనా సర్వే ప్రామాణికత శాంపిల్ సైజుతోపాటు అందుకు అనుసరించే శాస్త్రీయ పద్ధతిపై ఆధారపడి ఉంటుంది. ఇక ఈ సర్వే విషయాన్ని పక్కనపెడితే.. కేసీఆర్ పై అంతటి వ్యతిరేకత లేదన్నది మాత్రం క్షేత్ర స్థాయి పరిస్థితులను బట్టి చెప్పొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.