ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు హాజరైన అతిథుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఒకరు. అమరావతి రాజధానిగా ఆంధ్రప్రదేశ్ అద్భుత ప్రగతి సాధించాలని ఆ సందర్భంగా కేసీఆర్ ఆకాంక్షించారు. అంతేనా, రాజధాని నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్‌కి సాయం చేయాలని కూడా అనుకున్నారు.
కానీ, అదే కేసీఆర్.. ఇంకో సందర్భంలో ‘అమరావతి దండగమారి ప్రాజెక్ట్’ అనేశారు. పోలవరం ప్రాజెక్టుకి అడ్డుపుల్ల కూడా వేశారు. ఆ తర్వాత అదే కేసీఆర్, ‘తాను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కూడా కాంక్షిస్తాను..’ అని చెప్పారు. 2019 ఎన్నికల సమయంలో వైఎస్ జగన్‌కి పరోక్ష సహకారం అందించారు. తాజాగా గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల వేళ, వరి పంట సాగు విషయంలో ఆంధ్రప్రదేశ్‌ని కిందికి తోసేశాం.. అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారం రేపుతున్నాయి.
ఒక్క వరి సాగు విషయంలోనే కాదు.. అభివృద్ధి విషయంలోనూ ఏపీని ఎప్పుడో ఎక్కడో తొక్కేశారు కేసీఆర్.. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. మహారాష్ట్రతో, కర్నాకటతో లేని నీటి వివాదాలు తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్తోనే ఎందుకు.? అన్న ప్రశ్నకు సమాధానం ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పార్టీలకు తెలియకపోవడం శోచనీయం.
తెలంగాణలోనూ రాజకీయాలున్నాయి.. మరీ, ఆంధ్రప్రదేశ్‌లో వున్నంత దిగజారుడు స్థాయిలో కాదు. ఆంధ్రప్రదేశ్‌కి శాపం.. అక్కడి రాజకీయ వ్యవస్థే. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. ఇదది కఠోర వాస్తవం. అప్పుడు చంద్రబాబు, ఇప్పుడు వైఎస్ జగన్.. పెద్దగా తేడాల్లేవు. ఏపీఎస్ఆర్టీసీకి నష్టం కలిగించేలా తెలంగాణ వ్యవహరిస్తే, ఆంధ్రప్రదేశ్ సర్దుకుపోయింది. అంటే, ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాల కంటే కూడా.. కేసీఆర్‌తో దోస్తీనే వైఎస్ జగన్ సర్కార్‌కి ముఖ్యమైపోయిందని అనుకోవాలేమో.
ఆంధ్రప్రదేశ్‌ని తొక్కేశాం.. అని కేసీఆర్ నినదిస్తున్న వేళ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క మంత్రి కూడా ఈ విషయమై స్పందించకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.? ప్రస్తుత మంత్రులే కాదు, చంద్రబాబు హయాంలో మంత్రులుగా పనిచేసినవారికీ నోరు పెగలడంలేదు. నిజమే.. తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోంది.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దిగజారిపోతోంది. ఈ నేరం ఎవరిది.? నూటికి నూరు పాళ్ళూ ఆంధ్రప్రదేశ్‌లోని పరిపాలించిన, పరిపాలించినవారిదే.