మత విద్వేషాలతో జీహెచ్‌ఎంసీ ఎన్నికల వాయిదాకు కుట్ర: కేసీఆర్

కొన్ని రాజకీయ పార్టీలు, మతంకు చెందిన సంస్థలు ఎలాగైనా జీహెచ్‌ఎంసీ ఎన్నికలను ఆపేయాలనే ప్రయత్నాలు చేస్తున్నాయి అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్‌ చాలా ఘాటుగా స్పందించారు. గెలుపుపై నమ్మకం లేని కొన్ని రాజకీయ పక్షాలు నిరాశతో అరాచక శక్తులతో చేతులు కలిపి మత విద్వేశాలను రెచ్చగొట్టి అల్లర్లకు పాల్పడాలనే ఉద్దేశ్యంతో ఉన్నారు. అందుకు సంబంధించిన కుట్ర జరుగుతున్నట్లుగా సీఎం కేసీఆర్‌ అన్నారు.

పోలీసులు జాగ్రత్తగా వ్యవహరించాలని అలాంటి శక్తులను ఉక్కుపాదంతో అణచి వేసేందుకు సీఎం ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రగతి భవన్‌ లో పోలీసులతో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసిన కేసీఆర్‌ ఈ వ్యాఖ్యలను చేశారు.

ఎన్నికల్లో గెలిచేందుకు సోషల్‌ మీడియాలో కొందరు తప్పుడు ప్రచారాలు చేయడంతో పాటు మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పోస్ట్‌లు పెడుతున్నారు. అలాంటి వారిపై కూడా కఠినంగా వ్యవహరించాలంటూ సీఎం సూచించారు.

ఖమ్మం, కరీంనగర్‌, వరంగల్‌ బయట ఎక్కడైనా గొడవలు మొదలు అయ్యేలా చూసి అక్కడ నుండి హైదరాబాద్‌కు దాన్ని తీసుకు వచ్చేలా కూడా కుట్ర జరుగుతుందని అన్ని విషయాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలంటూ ఈ సందర్బంగా సీఎం కేసీఆర్‌ పోలీసు అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ప్రశాంతంగా శాంతియుతంగా జరగాలని పోలీసులను సీఎం ఆదేశించారు.