కేసీఆర్‌ – జగన్‌ మధ్యలో బీజేపీ చిచ్చుపెట్టిందా.?

బీజేపీకి దగ్గరవుతున్నారు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి. ఆ విషయం అందరికీ అర్థమవుతోంది. అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనలు అందుకు భిన్నంగా వున్నాయి. రాజకీయ అంశాలు కాదు.. రాష్ట్రాలకు సంబంధించి, రాష్ట్రాల ప్రయోజనాలకు సంబంధించి.. కరోనా వైరస్‌ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ విజన్‌ చాలా క్లియర్‌గా వుంది. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు అందుకు భిన్నంగా వున్నాయి.

‘ఆంధ్రప్రదేశ్‌కి కూడా మీరే ముఖ్యమంత్రి అయితే బావుండేది..’ అంటూ ఆంధ్రప్రదేశ్‌కి చెందిన చాలామంది సోషల్‌ మీడియా వేదికగా టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ని అభినందిస్తుండడం, ఎక్కడో వైఎస్‌ జగన్‌కి ఇబ్బందికరంగా అన్పించినట్టుంది. ఆ తర్వాతే సీన్‌ మారిపోయింది. నిజమే, కేసీఆర్‌.. మీడియా ముందుకొస్తే, కరోనా సహా చాలా విషయాలపై మాట్లాడుతున్నారు.. ప్రజలకు భరోసా ఇస్తున్నారు. కానీ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఆలోచనలు వేరేలా వుంటున్నాయి. ఆయన ప్రెస్‌మీట్‌ అంటే అదో రికార్డెడ్‌ వ్యవహారమన్న అభిప్రాయం బలపడిపోయింది.

పైగా, జగన్‌ ప్రెస్‌ మీట్‌ అనగానే కామెడీలు ఎక్కువైపోతున్నాయి సోషల్‌ మీడియాలో. ఇవన్నీ ఓ ఎత్తు.. కేంద్రంపై పోరాటం విషయంలో కేసీఆర్‌ ‘యోధుడిలా’ వ్యవహరిస్తోంటే, వైఎస్‌ జగన్‌ మాత్రం సర్దుకుపోతున్నారు. లాక్‌డౌన్‌ ఎత్తివేయొద్దని కేసీఆర్‌ చెబితే, సడలింపులు కావాలని వైఎస్‌ జగన్‌ చెప్పారు. రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ తదితర జోన్ల వ్యవహారంలో వైఎస్‌ జగన్‌ తీరుని, కేసీఆర్‌ పరోక్షంగా తప్పు పట్టిన విషయం విదితమే. ఇక, మద్యం షాపులు తెరవడంపైనా కేసీఆర్‌ – వైఎస్‌ జగన్‌ వ్యవహారశౖలిలో వ్యత్యాసాలు సుస్పష్టం.

ఇప్పుడిక పోతిరెడ్డిపాడు వివాదం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్యా చిచ్చు పెట్టింది. ఈ మొత్తం వ్యవహారాన్ని జాగ్రత్తగా గమనిస్తోన్న బీజేపీ, లోలోపల పండగ చేసుకుంటోంది. నిజానికి, పోతిరెడ్డిపాడుకి సంబంధించిన వ్యవహారంలో జీవో ఇచ్చేముందు, అధికారుల స్థాయిలో తెలంగాణతో చర్చలు జరిగి వుండాల్సింది. అలా జరగకపోవడాన్ని కేసీఆర్‌ తట్టుకోలేకపోతున్నారు. ‘మానవతా కోణంలో చూడాలి..’ అంటూ ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, పోతిరెడ్డిపాడు వివాదంపై తెలంగాణ ప్రభుత్వానికి చురకలంటించడంతో వివాదం మరింత ముదిరి పాకాన పడింది.

టీఆర్‌ఎస్‌ నేతలంతా రాత్రికి రాత్రి వైఎస్సార్సీపీకి యాంటీగా మారిపోయారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిలానే జగన్‌ కూడా తెలంగాణకు ద్రోహం చేస్తున్నారంటూ విరుచుకుపడుతున్నారు. ఈ వివాదం మొత్తానికి కారణం బీజేపీయేనన్న భావన వైసీపీ వర్గాల్లోనూ వ్యక్తమవుతున్నా.. అది అధినేత స్థాయికి వెళ్ళడం కష్టం. టీఆర్‌ఎస్‌లో అయితే ఈ విషయమై పూర్తిస్థాయి స్పష్టత వుంది. ఇక, జగన్‌తో కేసీఆర్‌ దోస్తీ తెగిపోయినట్లేనని టీఆర్‌ఎస్‌ శ్రేణులు భావిస్తున్నాయి.