కీర్తీ సురేష్ అంటే మహానటి మాత్రమే గుర్తొస్తుంది. మహానటిలో తన అద్భుత ప్రదర్శనతో అలనాటి కథానాయిక సావిత్రిని కళ్లకు కట్టిందామె. తమిళంలో ‘ఇదు ఎన్న మాయమ్’ (2015) చిత్రంలో విక్రమ్ ప్రభు సరసన, 2016లో తెలుగులో హీరో రామ్ సరసన ‘నేను.. శైలజ’ లో కీర్తీ సురేష్ హీరోయిన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.
అయితే ఆ రెండు సినిమాలో హిట్ సాధించినప్పటికీ కీర్తీసురేష్‌కు మరుపు రాని సినిమాగా మాత్రం ‘మహానటి’ చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో అతిశయోక్తి లేదు. తనలో ఎంత అద్భుత నటనా ప్రతిభ ఉందో మహానటి సినిమా ద్వారా ప్రపంచానికి చాటి తన పేరుకు తగ్గ ‘కీర్తి’ని సంపాదించుకున్నారామె.
మహానటి తర్వాత ఆమెకు సినీ అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. తన సక్సెస్ గురించి కీర్తీ సురేష్ మాట్లాడుతూ …‘నేనీ స్థాయికి చేరుకోవడానికి చాలా కష్టపడ్డాను. ప్రయోగాత్మక పాత్రలు చేస్తూ కెరీర్‌లో రిస్క్ తీసుకుని ధైర్యంగా ముందడుగు వేశాను. నేను ఓవర్‌నైట్ స్టార్‌ని కాలేదు. కానీ ఊహించనదాన్ని కన్నా తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో నాకు మంచి ఫేమ్ వచ్చిందని మాత్రం చెప్పగలను. అలాగే ఇంత తక్కువ సమయంలో జాతీయ అవార్డు సాధిస్తానని కలలో కూడా ఊహించలేదు ’ అని ఆమె చెప్పుకొచ్చారు.
కీర్తీ సురేష్ అంటే సక్సెస్‌కు బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న ‘అన్నాత్తే’ చిత్రంలో కీర్తీ సురేష్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అలాగే తెలుగు, తమిళంలో ఆమె ప్రధాన పాత్ర పోషించిన సినిమాలు ‘మిస్ ఇండియా, గుడ్‌లక్ సఖి, పెంగ్విన్ ’ విడుదలకు సిద్ధమవుతున్నాయి.