కీర్తిసురేష్ మూవీ నేరుగా అమెజాన్ ప్రైమ్ రిలీజ్

అనుష్క నటించిన నిశ్శబ్దం సినిమాను రిలీజ్ కంటే ముందే ఓటీటీలోకి తీసుకొస్తారనే చర్చ ఓవైపు జోరుగా సాగుతుంటే.. మరోవైపు కీర్తిసురేష్ నటించిన ఓ సినిమా ఓటీటీలోకి రాబోతోంది. అవును.. కీర్తిసురేష్ నటించిన పెంగ్విన్ అనే సినిమాను థియేటర్లో కంటే ముందే అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం చేయబోతున్నారు. వచ్చే నెల 19న ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో స్ట్రీమింగ్ కు పెట్టబోతున్నారు.

లాక్ డౌన్ వల్ల థియేటర్లన్నీ మూతపడడంతో చాలా సినిమాలు థియేట్రికల్ రిలీజ్ కంటే ముందే ఓటీటీలోకి వస్తున్నాయి. ఇందులో భాగంగా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో రాబోయే రోజుల్లో 7 సినిమాల్ని ప్రసారం చేయబోతున్నట్టు అమెజాన్ ప్రకటించింది. ఇందులో ఒకటి కీర్తిసురేష్ నటించిన పెంగ్విన్ సినిమా.

ఈ లిస్ట్ లో జ్యోతిక నటించిన పొన్ మగల్ వందాల్ సినిమా కూడా ఉంది. సూర్య నిర్మించిన ఈ సినిమాపై కోలీవుడ్ లో ఆమధ్య చాలా రచ్చ జరిగింది. థియేటర్లలో రిలీజ్ చేయకుండా ఓటీటీకి ఎలా ఇస్తారంటూ డిస్ట్రిబ్యూటర్లు గొడవపెట్టారు. ఇలా చేస్తే సూర్య సినిమాల్ని కూడా థియేటర్లలో రిలీజ్ కాకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. అయినప్పటికీ సూర్య తగ్గలేదు, తన భార్య జ్యోతిక నటించిన సినిమాను థియేట్రికల్ రిలీజ్ కంటే ముందే అమెజాన్ ప్రైమ్ కు ఇచ్చేశాడు. ఈనెల 29న ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది.

అటు అమితాబ్ నటించిన ఓ బాలీవుడ్ సినిమా గులాబోసితావో కూడా థియేట్రికల్ రిలీజ్ కంటే ముందే అమెజాన్ ప్రైమ్ లోకి (జున్ 12న) వచ్చేస్తోంది. మరోవైపు విద్యాబాలన్ నటించిన శకుంతలదేవి సినిమా కూడా థియేటర్లలో కంటే ముందే ఓటీటీలోకి రాబోతోంది.

హిందీ, తమిళ్ తో పోలిస్తే.. తెలుగులో మాత్రం ఈ ట్రెండ్ కాస్త తక్కువగానే కనిపిస్తోంది. థియేటర్ల కంటే ముందుగా ఓటీటీలో రిలీజైన తొలి తెలుగు సినిమాగా అమృతారామమ్ గుర్తింపు తెచ్చుకుంది. ఓటీటీలోకి నేరుగా వచ్చిన డబ్బింగ్ సినిమాగా శక్తి అనే మూవీ గుర్తింపు తెచ్చుకుంది. ఓ మోస్తరు క్రేజ్ ఉన్న సినిమాలు మాత్రం ఇప్పటివరకు రాలేదు. సత్యదేవ్, నవీన్ చంద్ర నటించిన కొన్ని సినిమాలు ఇలా ఓటీటీలోకి ముందుగా రిలీజయ్యే అవకాశాలున్నాయి. రాజ్ తరుణ్ నటించిన ఒరేయ్ బుజ్జిగా, అనుష్క చేసిన నిశ్శబ్దం, రామ్ రెడ్ సినిమాల్ని తీసుకునేందుకు ఓటీటీలు ప్రయత్నించినప్పటికీ వర్కవుట్ కాలేదు.