తెలంగాణలో భారీ వర్షాలు, వరదల కారణంగా కనీ వినీ ఎరుగని నష్టం చోటు చేసుకున్న దరిమిలా, తమిళనాడు రాష్ట్రం.. తెలంగాణకు సాయం ప్రకటించింది. 10 కోట్ల రూపాయల్ని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిసామి, తెలంగాణ రాష్ట్రానికి అందివ్వనున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. ఈ సాయం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
నగదు సాయంతోపాటు, అవసరమైతే ఇతరత్రా సాయం కూడా అందిస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి ప్రకటించడాన్ని స్వాగతించిన కేసీఆర్, తమిళనాడు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా వుంటే, ఢిల్లీ ప్రభుత్వం తెలంగాణకు 15 కోట్ల సాయాన్ని ప్రకటించింది. హైద్రాబాద్ వరదల నేపథ్యంలో తెలంగాణకు అండగా వుంటామని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చెప్పారు.
తమిళనాడు, ఢిల్లీతోపాటు వివిధ రాష్ట్రాలు తెలంగాణకు సాయం అందించేందుకు ముందుకొస్తున్నాయి. కష్ట కాలంలో వివిధ రాష్ట్రాలకు తెలంగాణ గతంలో చేయూతనందించిన విషయం విదితమే. హుద్‌హుద్ తుపాను సమయంలో ఆంధ్రప్రదేశ్‌కీ తెలంగాణ సాయమందించింది. కాగా, హైద్రాబాద్‌లో ముంపు ప్రాంతాల్లో సహాయ చర్యల నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కొన్ని బోట్లను పంపించనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.