‘సినిమా టిక్కెట్ల ధరలు, తినుబండారాల ధరల నియంత్రణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదే.. పేదవారికి వినోదం భారం కాకూడదనే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిగారు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. దీనిపై రాజకీయాలు తగవు’ అని ‘తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన రిలీజ్ చేశారు.
‘‘సినిమా టిక్కెట్ల ధరలను ఇష్టానుసారంగా పెంచడం, తినుబండారాలను అధిక ధరలకు విక్రయించడం వల్ల పేదలకు వినోదం భారమవుతోంది. ఉన్నతస్థాయి కమిటీ ఇచ్చిన సిఫారసుల ఆధారంగానే ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. రోజు మొత్తం సినిమాలను ప్రదర్శించే విధానానికి అడ్డుకట్ట వేయడం మంచి నిర్ణయం. ప్రభుత్వ నిబంధనలు ఏ ఒక్క సినిమాకో కాకుండా అన్నిటికీ వర్తిస్తాయని స్పష్టంగా పేర్కొన్నారు. దాన్ని రాజకీయ నిర్ణయంగా పరిగణించడం ఆ యా పార్టీ నాయకుల అజ్ఞానానికి నిదర్శనం’’ అని కేతిరెడ్డి పేర్కొన్నారు.