కేజీఎఫ్‌ విషయంలో అంత పట్టుదల ఎందుకు?

కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా ప్రపంచంలో పలు దేశాలు లాక్‌ డౌన్‌ అమలు చేశాయి. ఇండియాలో రెండు నెలల పాటు లాక్‌ డౌన్‌ కొనసాగింది. ఇంకా కూడా లాక్‌ డౌన్‌లోనే ఇండియా ఉంది. కాని అన్నింటికి కూడా పర్మీషన్స్‌ ఇచ్చేశారు. షూటింగ్స్‌ కూడా జరుపుకునేందుకు సిద్దం అయ్యారు. ఇక ఈ ఏడాదిలో సినిమాల విడుదల విషయంలో పెద్ద హీరోలు ఎవరు కూడా ఆసక్తిగా లేరు. ఆగస్టు నుండి థియేటర్లు ఓపెన్‌ అయినా కూడా సినిమాల విడుదల విషయంలో మాత్రం ఇంట్రెస్ట్‌ చూపించడం లేదు.

స్టార్‌ హీరోలు అంతా కూడా తమ సినిమాలను వాయిదా వేసుకుంటూ ఉంటే కేజీఎఫ్‌ 2 చిత్రాన్ని మాత్రం ముందు నుండి అనుకున్నట్లుగానే అక్టోబర్‌ లోనే విడుదల చేయాలని భావిస్తున్నారట. సినిమాల పోటీ పెద్దగా లేకపోవడంతో పాటు, థియేటర్లలో సినిమాలు లేక పోవడం వల్ల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ కారణంగానే సినిమాను అక్టోబర్‌ లో విడుదల చేస్తే బాగుంటుందనే అభిప్రాయంలో కేజీఎఫ్‌ 2 మేకర్స్‌ ఉన్నారు.

కేజీఎఫ్‌ చిత్రం కన్నడంలో తెరకెక్కి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. అంతటి ఘన విజయం సాధించిన కేజీఎఫ్‌ కు సీక్వెల్‌ రూపొందింది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో యశ్‌ హీరోగా ఈ చిత్రం తెరకెక్కి విడుదలకు రెడీ అవుతుంది. షూటింగ్‌ దాదాపుగా పూర్తి అయ్యిందని, త్వరలోనే సినిమాకు సంబంధించిన విడుదల తేదీని మరోసారి అఫిషియల్‌గా అనౌన్స్‌ చేసి ప్రమోషన్‌ కార్యక్రమాలు మొదలు పెట్టబోతున్నట్లుగా కన్నడ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.