కిమ్ బతికే వున్నాడట.. అయితే మనకేంటి.?

ప్రపంచమంతా కరోనా వైరస్‌ దెబ్బకి విలవిల్లాడుతోంటే, ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్‌ ఉన్‌ చనిపోయాడంటూ నానా యాగీ జరుగుతోంది. ఈ మేరకు ఓ వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన విషయం విదితమే. ప్రపంచానికి పట్టిన చెదగా కిమ్ జాంగ్‌ ఉన్‌ని అభివర్ణిస్తాయి అమెరికా లాంటి కొన్ని దేశాలు. అవును మరి, అగ్రరాజ్యం అమెరికానే గడగడలాడించేస్తోంది ఉత్తర కొరియా ఎన్నో ఏళ్ళుగా. అత్యంత శక్తివంతమైన న్యూక్లియర్‌ వెపన్స్‌ తయారు చేసి, ప్రయోగించడంలో ఉత్తరకొరియాది అందెవేసిన చెయ్యింది. అమెరికా బెదిరింపులు ఓ పక్క.. వాటిని ఉత్తర కొరియా లెక్క చేయకపోవడం ఇంకోపక్క.. వెరసి, ఎప్పటికప్పుడు ‘మూడో ప్రపంచ యుద్ధం’ అనే సంకేతాలు బయటకొస్తూనే వుంటాయి.

ప్రపంచం మొత్తమ్మీద అమెరికా బెదిరింపులకు లొంగనిది ఒక్క ఉత్తర కొరియా మాత్రమే. ఉత్తర కొరియా రూటే సెపరేటు. పైగా, ఆ దేశ నియంత కిమ్ జాంగ్‌ ఉన్‌ ఇంకా ప్రత్యేకం. గత కొద్ది రోజులుగా ఆయన కన్పించకపోవడం (మీడియా ముందుకు రాకపోవడం) పలు అనుమానాలకు తావిచ్చింది. కిమ్ జాంగ్‌ ఉన్‌ చనిపోయాడంటూ అమెరికానే తొలుత ప్రచారానికి తెరలేపింది. ‘కిమ్ జాంగ్‌ ఉన్‌కి సంబంధించి కీలకమైన విషయాలు మాకు తెలుసు. కానీ, ఇప్పుడు చెప్పలేం..’ అంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ వెటకారం చేసిన కొద్ది గంటల్లోనే, ‘ఇదిగో కిమ్ జాంగ్‌ ఉన్‌..’ అంటూ ఉత్తర కొరియా అధికారిక మీడియా కొన్ని ఫొటోల్ని విడుదల చేసింది. దాంతో అమెరికా నోటికి తాళం పడ్డట్లయ్యింది.

అయినాగానీ, కిమ్ చనిపోయాడనీ.. ఉత్తర కొరియా అధికారిక మీడియా ప్రపంచాన్ని ‘మాయ’ చేసేందుకు ప్రయత్నిస్తోందంటూ కథనాలు వెల్లువెత్తుతూనే వున్నాయి. అయినా, కరోనా వైరస్‌ దెబ్బకి అమెరికాలో వందల మంది, వేల మంది ప్రాణాలు కోల్పోతోంటే.. అమెరికాకి కిమ్ జాంగ్‌ ఉన్‌ మరణం గురించి ఎందుకు అంత అత్యుత్సాహం.? అంటే, కిమ్ జాంగ్‌ ఉన్‌ చూసి అమెరికా భయపడుతోందనే కదా అర్థం.?