ఎంటర్టైన్ చేస్తాం.. థియేటర్లకు రండి ప్లీజ్

మార్చి నెలలో తొలి మూడు వారాలు సినిమాలు రిలీజ్ చేయడం పెద్ద రిస్క్. సినిమాలకు మహరాజ పోషకులైన యూత్ ఆడియన్స్‌లో చాలామంది పరీక్షలతో బిజీగా ఉంటారు ఈ టైంలో. అందుకే ఏడాదిలో ఇంకే నెలలోనూ లేనంత డల్లుగా ఉంటుంది బాక్సాఫీస్. ఒకప్పుడు ఈ నెలలో కొత్త రిలీజ్‌లు చాలా తక్కువగా ఉండేవి. కానీ గత కొన్నేళ్లలో పెద్ద సినిమాల తాకిడి ఎక్కువైపోవడం.. చిన్న సినిమాలకు వేరే సీజన్లలో థియేటర్లు దొరక్కపోవడంతో ఈ నెలలో చాలా సినిమాలే రిలీజ్ చేస్తున్నారు. వారానికి కనీసం రెండు రిలీజ్‌లు ఉంటున్నాయి.

ఈ శుక్రవారం అయితే ఏకంగా మూడు పేరున్న సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. అవే.. గుంటూరోడు, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, ద్వారక.
ఈ మూడు సినిమాల మీద కూడా జనాలకు బాగానే ఆసక్తి ఉండటం.. ఇవి మూడూ పాజిటివ్ బజ్ మధ్య రిలీజవుతుండటం విశేషమే. ఈ మూడూ కూడా ఎంటర్టైన్మెంట్‌ను నమ్ముకున్న సినిమాలే కావడం మరో విశేషం. గత ఏడాది సరిగ్గా మార్చి తొలి వారంలోనే మనోజ్ సినిమా ‘శౌర్య’ విడుదలైంది. దారుణమైన ఫలితం అందుకుంది. ఆ తర్వాత చేసిన ‘ఎటాక్’తోనూ మనోజ్‌కు అలాంటి అనుభవమే ఎదురైంది. ఐతే మనోజ్ ఈసారి ప్రయోగాలు మాని.. ‘గుంటూరోడు’ లాంటి మాస్ మసాలా సినిమా చేశాడు. ఇది మాస్ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న సినిమా.

మరోవైపు రాజ్ తరుణ్ నటించిన ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ లాగా కనిపిస్తోంది. ప్రధానంగా యూత్‌ను లక్ష్యంగా చేసుకున్న సినిమా ఇది. దీని టీజర్.. ట్రైలర్ రెండూ కూడా సినిమాపై అంచనాలు పెంచాయి. ఇక ‘పెళ్లిచూపులు’ తర్వాత విజయ్ దేవరకొండ నటించిన సినిమా కావడంతో ‘ద్వారక’ మీద కూడా బాగానే ఆసక్తి ఉంది. ఇందులో విజయ్ దొంగగా.. బురిడీ బాబాగా కనిపించనున్నాడు. ఈ సినిమా కూడా వినోదాత్మకంగా ఉండేలా కనిపిస్తోంది. మరి ఎంటర్టైన్మెంట్‌ను నమ్ముకుని రిస్కీ సీజన్లో ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ మూడు సినిమాలకు ప్రేక్షకులు ఎలాంటి ఫలితాన్నిస్తారో చూడాలి.