మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆచార్య’ చిత్రం లాక్‌డౌన్ కారణంగా ఆగిపోయింది. ఇప్పటి వరకు సినిమా షూటింగ్ దాదాపుగా సగం పూర్తి అయ్యిందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా బడ్జెట్ విషయంలో పునరాలోచిస్తున్నట్లుగా గత రెండు మూడు రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. చిరంజీవి సలహా మేరకు కొరటాల శివ బడ్జెట్‌ను తగ్గించేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఆచార్య సినిమాకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఖచ్చితంగా వంద కోట్లు వసూళ్లు సాధించేది. కాని లాక్‌డౌన్ తర్వాత థియేటర్లు ఓపెన్ అయితే, ఆ సమయంలో సినిమా విడుదల అయితే పరిస్థితి ఎలా ఉంటుందో అనే ఉద్దేశ్యంతో బడ్జెట్ విషయంలో కాస్త వెనుక ముందు ఆడుతున్నారు అనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమాను వచ్చే ఏడాదికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారు. అప్పటి వరకు కరోనా ఉదృతి తగ్గడం లేదంటే వ్యాక్సిన్ రావడం జరుగుతుంది. ఒకవేళ కరోనా వ్యాక్సిన్ వచ్చే వరకు కూడా ఈ సినిమా విడుదల వాయిదా వేసే అవకాశాలు లేకపోలేదు.
ఈ కారణాల వల్ల ఆచార్య సినిమా బడ్జెట్ విషయంలో మార్పులు చేర్పులు అవసరం లేదు అనేది కొందరి అభిప్రాయం. కొరటాల శివ ఏ సినిమా చూసినా కూడా మీడియం రేంజ్ బడ్జెట్ ఉంటుంది. భారీగా విదేశాల్లో చిత్రీకరణ చేయడం, హంగు ఆర్బాటాలు ఎక్కువగా ఉండటం కనిపించదు. కనుక ఆచార్య సినిమాకు కూడా అలాగే ఉంటుంది. ఇంకా దాన్ని తగ్గించాల్సిన అవసరం లేదు అనేది కొందరి అభిప్రాయం.