కోట శ్రీనివాసరావు.. తెలుగు తెరపై తిరుగులేని నటుడు. చేయని పాత్ర లేదు. చూపించని వేరియేషన్ లేదు. విలనీ, కామెడీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఇలా పాత్ర ఏదైనా అందులో ఒదిగిపోవడం, తనదైన ముద్ర వేయడం కోట స్టయిల్.
ఇలా ఎంతో కీర్తిప్రతిష్టలతో పాటు కావాల్సినంత డబ్బు కూడా సంపాదించిన కోట.. అవకాశాల కోసం దర్శకుల వెంట పడుతున్నారా? ఒక్క ఛాన్స్ ఇవ్వమని డైరక్టర్లను వేడుకుంటున్నారా? అవుననే అంటున్నారు కోట. ఎవరైనా దర్శకుడు కనిపిస్తే ఓ వేషం ఇవ్వమని అడుగుతానని ఒప్పుకున్నారు..
“దర్శకులు ఎవరైనా కనిపిస్తే నేనే వేషాలు ఇవ్వమని అడుగుతుంటాను. ఈ స్థాయిలో ఉండి అడగడం ఏంటని కొందరు వారిస్తుంటారు. అది అడుక్కుతినడం కాదు. ఖాళీగా కూర్చోలేక అలా అవకాశాలు అడుగుతుంటాను. రోజుకు 20 గంటలు పనిచేసిన వ్యక్తిని నేను. ఏమీ చేయకుండా ఇంట్లో కూర్చొని టీవీ చూడమంటారా. నేను చేయగలను. నా శక్తికి తగ్గ వేషాలుంటాయి. అవే ఇవ్వమని అడుగుతున్నాను.”
మద్యం తాగి కొన్ని సినిమాల్లో నటించిన విషయాన్ని అంగీకరించారు కోట. తనకు డైలాగ్ వెర్షన్ లేని సీన్లలో తాగి నటించానని, అలాంటి సినిమాలు ఓ పాతిక వరకు ఉన్నాయని చెబుతున్నారు. తను తాగి నటిస్తాననే విషయాన్ని ముందుగానే డైరక్టర్ కు చెబుతానని, దర్శకుల అనుమతితోనే తాగేవాడినని చెప్పుకొచ్చారు.